కూరగాయల మార్కెట్లో రాహుల్ గాంధీ.. ఆశ్చర్యపోయిన వ్యాపారులు
ఢిల్లీ ఆజాద్‌పూర్ మండీకి ఉదయాన్నే ఆకస్మికంగా వచ్చిన రాహుల్ గాంధీ.. మార్కెట్ అంతా కలియ తిరిగారు. అక్కడి వెజిటెబుల్ వెండర్స్‌తో కాసేపు ముచ్చటించారు.
సమయం ఉదయం 4.00 గంటలు.. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ కూరగాయలు, పండ్ల మార్కెట్.. ఆసియాలో అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న అక్కడ.. వ్యాపారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. హోల్ సేల్ వ్యాపారులు, రిటైల్ వెండర్లు అందరూ కూరగాయలు, పండ్ల అమ్మకాలు, కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు. అప్పుడే అక్కడకు ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. అతడిని చూడగానే గుర్తు పట్టిన వ్యాపారులు, కొనుగోలుదారులు ఆశ్చర్యపోయారు. ఆయనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.
ఢిల్లీ ఆజాద్‌పూర్ మండీకి ఉదయాన్నే ఆకస్మికంగా వచ్చిన రాహుల్ గాంధీ.. మార్కెట్ అంతా కలియ తిరిగారు. అక్కడి వెజిటెబుల్ వెండర్స్‌తో కాసేపు ముచ్చటించారు. దేశవ్యాప్తంగా ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలపై రాహుల్ గాంధీ చర్చించారు. చాలా కూరగాయలు కేజి రూ.100కు పైగా ధర ఉండటం.. ముఖ్యంగా టమాటాలు రూ.200 దాటిపోవడంపై ఆరా తీశారు. దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా.. ఏ రాష్ట్రంలో చూసినా టమాటా ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతున్నది.
దేశంలో కూరగాయల ధరలు పెరగడానికి కారణాలు.. పెరిగిన ధరల వల్ల వ్యాపారులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అలాగే కొనుగోలుదారుల ఇక్కట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ ఆజాదీపూర్ మండీ సందర్శనపై కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 'ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ ఈ రోజు ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీని సందర్శించారు. అక్కడి వ్యాపారుల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది' అని ట్వీట్‌లో పేర్కొన్నది.
కొన్ని రోజుల క్రితం హర్యానాలోని సోనేపట్ వెళ్లిన రాహుల్ గాంధీ.. అక్కడ పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల దగ్గరకు వెళ్లారు. రైతుల సమస్యలను తెలుసుకొని.. ఒక పంటకు ఎంత ఖర్చు అవుతోంది. అలాగే ఎంత మేర ఆదాయం లభిస్తోందో అడిగి తెలుసుకున్నారు. అలాగే ట్రక్ డ్రైవర్లతో కూడా ముచ్చటించారు. తాజాగా కూరగాయలు, పండ్ల వ్యాపారులను కలిసి.. వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.
కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్లతో భేటీ అయ్యారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ మెన్స్ హాస్టల్ సందర్శించి వారితో కలిసి లంచ్ చేశారు. ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో యూపీఎస్సీ ఆశవాహులతో భేటీ అయ్యారు. ఏప్రిల్‌లో ఢిల్లీలోని జామా మసీద్, బెంగాలీ మార్కెట్లను కూడా సందర్శించారు.