దేవుడికే సృష్టి రహస్యాలు చెప్పగల మేధావి మోదీ..
తమకే అంతా తెలుసని భ్రమించే వారి నాయకత్వంలో ప్రస్తుతం భారత్ ఉందని విమర్శించారు రాహుల్ గాంధీ. దేవుడితో కూర్చుని ఆయనకే విశ్వం గురించి వివరించే నాయకుడు మోదీ అని చెప్పారు.
రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై సెటైర్లు పేల్చారు. ఆయన వేసిన జోకులు ఓ రేంజ్ లో పేలాయి. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో భారత సంతతికి చెందిన విద్యావేత్తలు, పౌరసమాజ ప్రతినిధులతో మాట్లాడుతూ మోదీపై చెణుకులు విసిరారు రాహుల్.
ఇంతకీ రాహుల్ ఏమన్నారంటే..?
సైంటిస్ట్ లకు సైన్స్ గురించి చెప్పగల మేధావి మోదీ.
చరిత్రకారులకు హిస్టరీ పాఠాలు చెప్పగల సమర్థుడు మోదీ.
సైనికులకు యుద్ధం చేయడంలో మెళకువలు నేర్పించగల శిక్షకుడు మోదీ.
ఫైనల్ గా దేవుడి పక్కన మోదీని కూర్చోబెడితే ఏమవుతుందే తెలుసా అంటూ రాహుల్ గాంధీ అనే సరికి అందరూ ఆసక్తిగా విన్నారు. "మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే విశ్వం ఎలా పనిచేస్తుందో దేవుడికే చెబుతాడు. దీంతో తానేం సృష్టించానో తెలియక దేవుడు గందరగోళానికి గురవుతాడు." అన్నారు రాహుల్.
మిడిమిడి జ్ఞానం..
తమకే అంతా తెలుసని భ్రమించే వారి నాయకత్వంలో ప్రస్తుతం భారత్ ఉందని విమర్శించారు రాహుల్ గాంధీ. దేవుడితో కూర్చుని ఆయనకే విశ్వం గురించి వివరించే నాయకుడు మోదీ అని చెప్పారు. ప్రతి విషయంలో మోదీ తన పాండిత్యం నిరూపించుకోవాలనుకుంటారని ఎద్దేవా చేశారు. మిడిమిడి జ్ఞానం కలిగిన వీరంతా ఏ విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేరన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్ధలు, ఏజెన్సీలను పాలకులు దుర్వినియోగం చేస్తుండటంతో దిక్కుతోచని స్ధితిలో భారత్ జోడో యాత్రను చేపట్టానని గుర్తుచేశారు రాహుల్ గాంధీ. తన యాత్రను అడ్డుకోడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందన్నారు. అన్ని మతాలు, వర్గాల ప్రజల విశ్వాసాలను కాంగ్రెస్ గౌరవిస్తుందన్నారు రాహుల్ గాంధీ. ఆ విలువలను అంగీకరించిన వారే తనతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఒకవేళ కాంగ్రెస్ ని నమ్మలేదు అనుకుంటే.. మన్ కీ బాత్ లో బిజీగా ఉండేవారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, ముస్లింలను సమానంగా ఆదరిస్తామని స్పష్టం చేశారు.