గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన రాహుల్.. హామీలపై కీలక వ్యాఖ్యలు
1.1 కోట్ల కుటుంబాలలోని మహిళలకు గృహలక్ష్మి ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతి మహిళకు నెల నెలా 2 వేల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సాయంగా ఇస్తుంది. పేద ప్రజలకు మేలు చేసే పథకాల అమలులో కాంగ్రెస్ వెనకంజ వేయబోదని, ప్రకటించిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని చెప్పారు రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇస్తుందన్నారు రాహుల్ గాంధీ. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టదని స్పష్టం చేశారాయన. కాంగ్రెస్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కర్నాటకలో గృహలక్ష్మి పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
కర్నాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మహిళలపై వరాల జల్లు కురిపించింది. అయితే అధికారంలోకి వచ్చాక వాటి అమలు విషయంలో మాత్రం కాస్త తడబడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. తడబాటు ఉన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా ఉచిత ప్రయాణాలతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఆ సంగతి పక్కనపెడితే ఇప్పుడు ప్రభుత్వంపై మరింత భారం మోపే గృహలక్ష్మి పథకాన్ని అమలులోకి తెచ్చింది కర్నాటక కాంగ్రెస్ సర్కార్.
1.1 కోట్ల కుటుంబాలలోని మహిళలకు గృహలక్ష్మి ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతి మహిళకు నెల నెలా 2వేల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సాయంగా ఇస్తుంది. ప్రతి ఏటా ఈ పథకం కోసం 32వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పేద ప్రజలకు మేలు చేసే ఇలాంటి పథకాల అమలులో కాంగ్రెస్ వెనకంజ వేయబోదని, ప్రకటించిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని చెప్పారు రాహుల్ గాంధీ.
ప్రభుత్వాలు పేదల కోసం పనిచేయాలని, కానీ కేంద్రం సంపన్నుల కోసం పనిచేస్తోందని విమర్శించారు రాహుల్. కర్నాటక మహిళలు గొప్పవాళ్లని, రాష్ట్రం సాధించిన ప్రగతిలో వారిదే ప్రధాన పాత్ర అని కొనియాడారు. కర్నాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 5 హామీల్లో 4 నెరవేర్చామని చెప్పారు. ఈ పథకాలతో ఎక్కువగా మహిళలకే లబ్ధి చేకూరుతుందన్నారు రాహుల్.
♦