బంగ్లా ఖాళీ చేస్తా.. కానీ..!

బంగ్లాతో తనకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఆయన లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు సొంత ఇల్లు కూడా లేదని రాహుల్ గాంధీ చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.

Advertisement
Update:2023-03-28 20:49 IST

లోక్ సభ సభ్యుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతోపాటు.. ఆయనకు ఉన్న సౌకర్యాలన్నిటీనీ ఒక్కొక్కటిగా తొలగించే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా 12-తుగ్లక్ లేన్ రోడ్ లోని ఆయన అధికారిక నివాసాన్ని నెలరోజుల్లోగా ఖాళీ చేయాలంటూ నోటీసులిచ్చారు. లోక్ సభ హౌసింగ్ కమిటీ ఈ నోటీసులిచ్చింది. వీటిపై రాహుల్ స్పందించారు. అధికారుల ఆదేశాలు పాటిస్తానని చెబుతూ లోక్ సభ సెక్రటేరియట్ కు ఓ లేఖ రాశారు.

‘‘12- తుగ్లక్‌ లేన్‌ లో నాకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలంటూ లోక్‌ సభ సెక్రటేరియట్‌ పంపిన లేఖ అందింది. అందుకు కృతజ్ఞతలు. ప్రజల తీర్పుతో నాలుగు సార్లు లోక్‌ సభ సభ్యుడిగా ఎన్నికై నేను ఈ బంగ్లాలో ఉంటున్నాను. ఇక్కడ నాకు చాలా మధుర జ్ఞాపకాలున్నాయి. నా హక్కులకు భంగం కలగకుండా.. లేఖలో పేర్కొన్న విధంగా వ్యవహరించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. అది నా బాధ్యత. బంగ్లాను ఖాళీ చేస్తా’’ అని రాహుల్‌ గాంధీ తన లేఖలో వెల్లడించారు. బంగ్లాతో తనకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఆయన లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు సొంత ఇల్లు కూడా లేదని రాహుల్ గాంధీ చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.

రాహుల్‌ గాంధీని ఇబ్బంది పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. బంగ్లా ఖాళీ చేసిన తర్వాత ఆయన తన తల్లి దగ్గరకు వెళ్లి ఉంటారని, లేకపోతే తన దగ్గరకు వస్తారని, ఆయన కోసం తన ఇంటిలో చోటు ఉంటుందని చెప్పారు ఖర్గే. కానీ రాహుల్ ని బెదిరించడం, అవమానించడం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. 

Tags:    
Advertisement

Similar News