బస్సులో రాహుల్ ప్రయాణం.. మహిళల భావోద్వేగం
ప్రచారం చివరి రోజున రాహుల్ తీరిక లేకుండా గడిపారు. బస్సులో ప్రయాణిస్తూ మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నిర్వహించిన పలు ర్యాలీలకు హాజరయ్యారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజుతో మైకులు మూగబోయినట్టే. మే 10న ఎన్నికలు జరుగుతాయి. ఇక చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ జోరు చూపించింది. రాహుల్ గాంధీ చివరి రోజు బస్సులో ప్రచారం చేస్తూ మహిళలతో మాట్లాడారు. సడన్ గా బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సులో రాహుల్ కనపడే సరికి మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. ఆయనను కొంతమంది ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.
బస్సు ప్రయాణంలో రాహుల్ గాంధీ.. మహిళలు, కళాశాల విద్యార్థినులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావాన్ని ఓ మహిళ రాహుల్ దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వల్ల జరుగుతున్న నష్టాలను ఏకరువు పెట్టింది.
మేనిఫెస్టోపై వివరణ..
కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గృహలక్ష‍్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 ఇస్తామనే హామీని రాహుల్ గాంధీ మరోసారి బస్సులో గుర్తుచేశారు. మహిళలకు బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూడా చెప్పారు. ప్రచారం చివరి రోజున రాహుల్ తీరిక లేకుండా గడిపారు. బస్సులో ప్రయాణిస్తూ మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నిర్వహించిన పలు ర్యాలీలకు హాజరయ్యారు.
ఈ రోజుతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార ముగుస్తుండగా.. రేపు ఒక్కరోజు విరామం తర్వాత ఎల్లుండి ఉదయం పోలింగ్ జరుగుతుంది. వోట్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమం ఇప్పటికే ముగిసింది. మే 13న కౌంటింగ్ చేపట్టి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు జరుగుతాయి.