హిట్లర్ మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ..

నిర్మలా సీతారామన్ కి ఆర్థిక వ్యవహారాలపై అవగాహన శూన్యం అని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా ఆమె కేవలం బీజేపీ అధికార ప్రతినిధిగానే వ్యవహరిస్తున్నారని, ఆర్థిక మంత్రిగా ఆమెకు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు.

Advertisement
Update:2022-08-05 14:27 IST

ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. మోదీ హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నారని, అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్నారని, అలా వ్యవస్థల్ని గుప్పెట పడితే ఎన్నికల్లో విజయం కష్టమైన పనేమీ కాదని చెప్పారు. కేవలం ముగ్గురు వ్యక్తుల కోసమే ఇద్దరు నేతలు నియంతల్లా మారారని మండిపడ్డారు. ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్ సృష్టించినదాన్ని.. కేవలం ఎనిమిదేళ్లలో నాశనం చేశారని విమర్శించారు రాహుల్ గాంధీ.

అధికార ప్రతినిధా..? ఆర్థిక మంత్రా..?

నిర్మలా సీతారామన్ కి ఆర్థిక వ్యవహారాలపై అవగాహన శూన్యం అని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా ఆమె కేవలం బీజేపీ అధికార ప్రతినిధిగానే వ్యవహరిస్తున్నారని, ఆర్థిక మంత్రిగా ఆమెకు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్​ కేసులో తమని ఎన్ని ప్రశ్నలైనా వేసుకోవచ్చని అన్నారు రాహుల్. ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడమే తన పని అని, అందుకు ప్రతిగా తనపై దాడి చేసినా ఏమాత్రం తగ్గబోనని స్పష్టం చేశారు. తాము సిద్ధాంతం కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టే వారు గాంధీ కుటుంబంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ.

భారత్ లో రెండు వర్గాల మధ్య గొడవలు పెడుతుంటే, దళితుల్ని చంపేస్తుంటే, మహిళల్ని కొడుతుంటే చాలా బాధ కలుగుతోందన్నారు రాహుల్ గాంధీ. ఈ అరాచకాలన్నీ ఆగిపోయే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ పెంపుకి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌ కు ప్రదర్శనగా వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో పాల్గొన్న సీడబ్ల్యూసీ మెంబర్లు, కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ ఎదురుదాడి..

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత రాహుల్‌కి లేదని అన్నారాయన. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ కాలం మీకు గుర్తుందా అని ప్రశ్నించారు. అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు రవిశంకర్ ప్రసాద్. రాహుల్ గాంధీ, మహాత్మాగాంధీ వారసుడు కాదని ఆయన నకిలీ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సెటైర్లు వేశారు.

Tags:    
Advertisement

Similar News