ప్రారంభోత్సవమా.. పట్టాభిషేకమా..?

రాహుల్ గాంధీ ఈ ఘట్టాన్ని పట్టాభిషేకం అంటూ మండిపడ్డారు. అది పార్లమెంట్ ప్రారంభోత్సవంలాగా లేదని, మోదీ పట్టాభిషేకం లాగా ఉందని కౌంటర్ ఇచ్చారు రాహుల్.

Advertisement
Update:2023-05-28 14:01 IST

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం విషయంలో బీజేపీ పంతం నెగ్గించుకుంది. రాష్ట్రపతిని పిలవకుండా, ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా మోదీ చేతులమీదుగా నూతన పార్లమెంట్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి విపక్షాలు. ఆర్జేడీ, నూతన పార్లమెంట్ ని శవపేటికతో పోల్చగా.. రాహుల్ గాంధీ ఈ ఘట్టాన్ని పట్టాభిషేకం అంటూ మండిపడ్డారు. అది పార్లమెంట్ ప్రారంభోత్సవంలాగా లేదని, మోదీ పట్టాభిషేకం లాగా ఉందని కౌంటర్ ఇచ్చారు రాహుల్.


పార్లమెంట్ ప్రజల గొంతుక అని, కానీ పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని పట్టాభిషేకంలా చేశారంటూ విమర్శించారు రాహుల్ గాంధీ. గతంలో కూడా రాహుల్ గాంధీ కొత్తపార్లమెంట్ నిర్మాణంపై ట్వీట్ వేశారు. కొత్త పార్లమెంట్ రాజ్యాంగ విలువలతో ఉండాలని, కానీ అది అహం అనే ఇటుకలతో నిర్మించబడుతోందన్నారు. పార్లమెంట్ అంటే లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అనే మూడింటి కలయిక అని.. కానీ ప్రధాని ఒక్కడే పార్లమెంట్ కి నాయకుడు అనేలాగా ఆయన చేత ప్రారంభోత్సవం ఎలా చేయిస్తారనేది విపక్షాల సూటి ప్రశ్న.

20 పార్టీలు దూరం..

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా చేపట్టాలని మోదీ భావించినా 20 విపక్ష పార్టీలు బాయ్ కాట్ చేయడంతో ఆ ఉత్సవం కళ తప్పింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా దాన్ని ఓ పార్టీ కార్యక్రమంలా మార్చేసిందనే విమర్శలు వినపడుతున్నాయి. పార్లమెంట్ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్లిస్తున్నారు విపక్ష నేతలు.

Tags:    
Advertisement

Similar News