పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష.. ఆయన లాయర్లు ఏం చేశారంటే.!
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అతడిని దోషిగా తేల్చింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాందఈ.. మోడీని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరగాళ్లందరి పేర్లలో చివరి మోడీ అనే ఎందుకు ఉంటుందో అంటూ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ పరువు నష్టం దావా వేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యల కారణంగా 'మోడీ' అనే ఇంటి పేరు ఉన్న అందరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. మా పరువుకు భంగం కలిగించినందుకు బాధగా ఉందంటూ ఆయన కోర్టులో కేసు వేశారు. కాగా, సూరత్ కోర్టు ఈ కేసులో తుది తీర్పును గురువారం ఇచ్చారు. రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం దోషిగా తేల్చింది.
కాగా, ఈ కేసులో ఇచ్చిన తీర్పుపై పై కోర్టులో సవాలు చేయడానికి రాహుల్ గాంధీకి గడువు ఇచ్చింది. తీర్పు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ లాయర్లు గుజరాత్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఆయనకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి రూ.10 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. త్వరలోనే రాహుల్ గాంధీ జైలు శిక్షపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేస్తామని లాయర్లు తెలిపారు. అవసరం అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని వాళ్లు స్పష్టం చేశారు.