బీజేపీ మొద‌టి ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు.. నిజ‌మేనా..?

పి.వి.నరసింహారావు తన మౌనం వీడలేదు. డిసెంబర్‌ 5 రాత్రి కూడా హోంమంత్రిత్వశాఖ వర్గాలు ప్రధానికి బాబ్రీమసీదు కూల్చివేత ప్రమాదం గురించి వివరించాయి. కానీ, పివి మౌనమే వహించారు. ‘‘అయ్యేదేదో కానియ్యండి’’ అన్నట్టు వుండిపోయారు.

Advertisement
Update:2024-01-14 16:01 IST

అయోధ్యలో రామాలయ ఆరంభ సంరంభం వార్తలే మీడియా, సోషల్‌ మీడియాలో. అంతటా ఎనలేని హడావిడి. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం’ అనే కల సాకారానికి సహకరించిన వారందరికీ ఆహ్వానాలు అందాయి. కానీ, ఈ కల నెరవేరేందుకు తన మౌనంతో సహకరించిన మన మౌనముని, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావును మాత్రం ఎవరూ ప్రస్తావించడం లేదు. కనీసం వారి కుటుంబ సభ్యులను రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించలేదని వినికిడి. లాంఛనప్రాయంగానైనా వారికి ఆహ్వానాలు పంపించాల్సిన కర్తవ్యాన్ని రామజన్మభూమి ట్రస్టు విస్మరించిందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఆనాడు 1992 డిసెంబర్‌ మొదటివారం నుంచే దేశవ్యాప్తంగా కరసేవకులు సకల ప్రాంతాల నుంచి అయోధ్యకు చేరుకోవ‌డం మొదలు పెట్టారు. వారు అయోధ్యకు వస్తే ఏం జరుగుతుందో నాటి కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఇంటెలిజన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. వేలాదిమందిగా తరలివచ్చే కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చే ప్రమాదముందని నిఘావర్గాలు ప్రధానమంత్రి కార్యాలయానికి పక్కా సమాచారం ఇచ్చాయి. అప్పటికే ప్రతిపక్షాల వారు ఉత్తరప్రదేశ్‌లోని కల్యాణ్‌సింగ్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. కరసేవకులని ఎక్కడికక్కడ ఆపాలని గట్టిగా కోరాయి.

అయినా పి.వి.నరసింహారావు తన మౌనం వీడలేదు. డిసెంబర్‌ 5 రాత్రి కూడా హోంమంత్రిత్వశాఖ వర్గాలు ప్రధానికి బాబ్రీమసీదు కూల్చివేత ప్రమాదం గురించి వివరించాయి. కానీ, పివి మౌనమే వహించారు. ‘‘అయ్యేదేదో కానియ్యండి’’ అన్నట్టు వుండిపోయారు. వాళ్ళు అనుకున్నదొక్కటి అయిపోతే బిజెపికి ఇక అస్త్రాలు వుండవన్నట్టు నిష్క్రియాపరంగా నిలిచిపోయారు. మరోమాటలో చెప్పాలంటే రాజ్యాంగం నిర్దేశించిన కర్తవ్యాన్ని పక్కనపెట్టి ‘కానివ్వండన్న’ట్టు మౌనంగా వుండిపోయారు. దీనిపై తరువాత ఆయన కాంగ్రెస్‌పార్టీ నుంచే గాక అనేక వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ మధ్యన ‘‘బిజెపి మొదటి ప్రధాని పి.వి.నరసింహారావు’’ అని కూడా ఓ కాంగ్రెస్‌ నేత విమర్శించారు. ఆ మాటలో వ్యంగ్యం ఉన్నప్పటికీ అది ఒకరకంగా నిజం. ఎందుకంటే ఆనాడు పివి తన మౌనంతో సహకరించకపోతే బిజెపి ఇవాళ ఈ స్థాయిలో ఉండేది కాదు.

ఈవిధంగా బిజెపికి, ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం’ అనే కలకు గొప్పగా సహకరించిన ‘రాజనీతిజ్ఞుడు’, ‘అపర చాణుక్యుడు’ పి.వి. నరసింహారావును ఈ సందర్భంగా ఎవరూ గుర్తు చేయకపోవడం ఏమిటని పరిశీలకులు అంటున్నారు. జనవరి 22 రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సోనియాగాంధీకి సైతం ఆహ్వానాలు పంపించారు. కానీ, పి.వి. నరసింహారావు కుటుంబసభ్యులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపకపోవడం విస్మయకరం. ఇప్పటికయినా సమయం మించి పోలేదు. పివి పట్ల కృతజ్ఞత చూపే అవకాశాన్ని రామజన్మభూమి ట్రస్టు, బిజెపి వర్గాలు వదులుకోకూడదని రాజకీయ పరిశీలకులు కోరుతున్నారు. తద్వారా తెలుగువారి అభిమానాన్ని గెలుచుకునే వీలుందని సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News