ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటి పూట విధులు..పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటి పూట ఆఫీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

Advertisement
Update:2023-04-09 06:16 IST
ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటి పూట విధులు..పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం
  • whatsapp icon

సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండే వ్యక్తిగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు పేరుంది. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటి పూట ఆఫీసులను ప్రారంభించాలని మాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. మామూలుగా విద్యార్థులకు వేసవికాలం ఎండలు ముదిరిన తర్వాత సెలవులు ఇస్తారు. అయితే సెలవులకు ముందు వేసవి ఆరంభం అవగానే ఎండల నుంచి ఉపశమనం కోసం విద్యార్థులకు ఒంటి పూట తరగతులు నిర్వహిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎండ నుంచి ఉపశమనం కలిగించేందుకు ఒంటి పూట ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటి పూట ఆఫీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పంజాబ్ లో ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9.00 నుంచి సాయంత్రం 5. 00 గంటల వరకు నడుస్తున్నాయని.. ఈ కార్యాలయాలు వచ్చేనెల 2వ‌తేదీ నుంచి ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. జూలై 15వ తేదీ వరకు ఈ కొత్త పనివేళలు అమలులో ఉంటాయని ముఖ్యమంత్రి మాన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం పంజాబ్ లో ఎండల తీవ్రత అధికమైన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మాన్ ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం వరకే ఉండటం వల్ల విద్యుత్ కూడా ఆదా అవుతుందని ఆయన చెప్పారు. మే 2వ తేదీ నుంచి తాను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తానని మాన్ తెలిపారు.

కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటి పూట కార్యాలయాలు నిర్వహించడం బహుశా దేశంలో ఇదే తొలిసారి. ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి మాన్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతుండగా.. సోషల్ మీడియా వేదికగా కూడా మాన్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News