లైంగిక వేధింపుల వల్లే రాజీనామా.. మహిళా మంత్రి సంచలన ప్రకటన
తాను లైంగిక వేధింపులకు గురైనందువల్లే మంత్రి పదవికి రాజీనామా చేశానని చంద్ర ప్రియాంక తన లేఖలో ప్రకటించారు. అణగారిన వర్గానికి చెందిన తాను కులపరంగా, లైంగికపరంగా వేధింపులకు గురయ్యానని ఆ లేఖలో పేర్కొన్నారు.
తన పదవికి రాజీనామా చేసిన ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పుదుచ్చేరి రవాణా శాఖ మంత్రి చంద్ర ప్రియాంక తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ బుధవారం ఆమె ఒక లేఖ విడుదల చేశారు. అక్కడి మంత్రి వర్గంలో చంద్ర ప్రియాంక ఏకైక మహిళా మంత్రి కావడం గమనార్హం.
తాను లైంగిక వేధింపులకు గురైనందువల్లే మంత్రి పదవికి రాజీనామా చేశానని చంద్ర ప్రియాంక తన లేఖలో ప్రకటించారు. అణగారిన వర్గానికి చెందిన తాను కులపరంగా, లైంగికపరంగా వేధింపులకు గురయ్యానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ మంత్రిగా తాను కొనసాగలేనని ఆమె వివరించారు. రాష్ట్రంలో రాజకీయాలు డబ్బు, కుట్రలతో నిండిపోయాయని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమె లేఖ సంచలనం రేపుతోంది. ఆమెను ఇలా ఇబ్బంది పెట్టింది ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. పుదుచ్చేరిలో 40 ఏళ్ల తర్వాత ఒక మహిళకు మంత్రివర్గంలో స్థానం లభించింది. పుదుచ్చేరిలోని ఏఐఎన్‌ఆర్‌సీ–బీజేపీ కూటమిలోని ఏకైక మహిళా మంత్రి అయిన ఆమె ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తూ రాజీనామా చేయడం గమనార్హం. ఆమె లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.