యోగి ఆదిత్యనాథ్ ఆలయానికి తాళం వేసిన అధికారులు

ఈ ఏడాది జులైలో ఓ వ్యక్తి అయోధ్యలో ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ కు గుడికట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ గుడి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టాడని అధికారుల విచారణలో బైటపడటంతో ఆ గుడికి తాళం వేశారు.

Advertisement
Update:2022-09-27 13:00 IST

 ఉత్తరప్రదేశ్ అయోధ్యలో శ్రీరామునికి గుడి ఉన్నప్పుడు యోగీ ఆదిత్యా నాథ్ కు ఎందుకు ఉండకూడదు అంటూ ఆదిత్యానాథ్ అభిమాని ఒకరు ఓ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏకంగా గుడి కట్టేశాడు.

కళ్యాణ్ భదర్సా పంచాయితీలోని మౌర్య కా పూర్వా అనే గ్రామానికి చెందిన 32 ఏళ్ల మౌర్య ఆదిత్యనాథ్ యొక్క స్వీయ-ప్రకటిత ప్రచారకర్త. ఆయన మీద అనేక పాటలు రాసి పాడాడు. రికార్డు చేశాడు. అయినా ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించలేకపోయాడు. ఇక చివరకు ఆయనకు గుడి కట్టాలని నిర్ణయించుకొని ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ ఏడాది జులైలో గుడి కట్టి అందులో ఆదిత్యానాథ్ విగ్రహాన్ని పెట్టాడు.

దాంతో ఆయనకు విపరీతమైన ప్రచారం వచ్చింది. అయితే ఆయన గుడి కట్టిన భూమి ప్రభుత్వానిదన్న విషయం ఎవరికీ తెలియలేదు. అయితే అతని మేనమామ రామ్‌నాథ్ ఫిర్యాదుతో అసలు విషయం బైటపడింది. ఆ భూమిని ఆక్రమించుకునే ప్రణాళికతోనే మౌర్య ఆ గుడి కట్టాడని రామ్‌నాథ్ సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

మౌర్య మేనమామ పిర్యాదుతో కదిలిన జిల్లా యంత్రాంగం విచారణ జరిపి ఆ గుడి కట్టిన స్థలం ప్రభుత్వానిదే అని తేల్చారు. ఆ భూమిని వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం కేటాయించారని జిల్లా యంత్రాంగం విచారణలో తేలింది. దాంతో అధికారులు ఆ గుడికి తాళం వేశారు.

ఈ విషయం తెలిసిన మౌర్య గ్రామం నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న ఆయనను ది వీక్ న్యూస్ పోర్టల్ సంప్రదించగా... తానేం తప్పుచేయలేదని చెప్పాడు. "నేను దేవుడిగా భావించే వ్యక్తి పట్ల నా భక్తిని చూపించినందుకే నన్ను అన్యాయంగా టార్గెట్ చేస్తున్నారు". అన్నాడు మౌర్య. తనను, తన గుడిని రక్షించడానికి వేలాది మంది ఆదిత్యానాథ్ అభిమానులు అయోధ్య రావడానికి సిద్దంగా ఉన్నారని చెప్పాడాయన.

ఇక మరో వైపు యోగి ఆదిత్యానాథ్ విగ్రహాన్ని తయారు చేసినందుకు తనకు మౌర్య చిల్లి గవ్వ ఇవ్వలేదని, ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని చెప్పాడని శిల్పి ఆరోపిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News