సుప్రీంకోర్టు మిలార్డ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీ- సీజేఐపై కాషాయదళాల దాడి

సుప్రీంకోర్టు మిలార్డ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని బీజేపీ అనుకూల వర్గాలు దాడి చేస్తున్నాయి. మైనార్టీ హక్కులపై చంద్రచూడ్‌ తీరును గుర్తు చేస్తూ అతడు హిందూ వ్యతిరేకి అని, హిందువులపై దాడులకు సంబంధించిన కేసుల్లో ఉదాసీనంగా ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు.

Advertisement
Update:2023-06-03 11:08 IST

నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పేరున్న సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను బీజేపీ శ్రేణులు టార్గెట్ చేశాయా..? మిషిగాన్ యూనివర్శిటీ అధ్యయనంలోనే ఇదే తేలింది. బీజేపీ అనుకూల వ్య‌క్తులు సీజేఐను సోష‌ల్ మీడియా వేదిక‌గా టార్గెట్ చేసినట్టు వర్శిటీ నివేదిక వెల్లడించింది. సుప్రీంకోర్టులో కొన్ని తీర్పులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండటంతో జీర్ణించుకోలేక సీజేఐపై బీజేపీ అనుకూల వర్గాలు గురిపెట్టాయని వివరించింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున సీజేఐను ట్రోల్ చేస్తున్నట్టు అధ్యయనంలో గుర్తించారు. అది కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పేరుతో ఈ దాడి చేస్తున్నారు. విలువలు తెలియని వ్యక్తిగా, గ్లోబలిస్టుల మనిషిగా ఆయన్ను చిత్రీకరిస్తున్నారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ను హిందూ వ్యతిరేకిగా, విదేశాల మద్దతుదారుగా, దేశానికి అంతర్గత శత్రువుగా ఇలా రకరకాలుగా అభివర్ణిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలా ట్రోల్స్‌ చేస్తున్న వారి మూలాలు బీజేపీ అనుబంధ సంస్థల వద్ద తేలుతున్నాయి. పనిలో పనిగా కొలీజియం వ్యవస్థపైన విమర్శలకు దిగుతున్నారు. కొలీజియం కులతత్వంతో నిండిపోయిందని ఆరోపిస్తున్నారు. చంద్రచూడ్‌ తీర్పులు, వ్యవహారం వచ్చే ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందని కొందరు బీజేపీ అనుకూల వ్యక్తులు ఆందోళన చెందుతున్నట్టు అధ్యయనం గుర్తించింది. చంద్రచూడ్‌ తండ్రి వైవీ చంద్రచూడ్‌ 1978 నుంచి 1985 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ కోర్టుల్లో బంధుప్రీతి ఉందంటూ దాడి చేస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తిని మాత్రమే కాదు.. మొత్తం సుప్రీంకోర్టుకే పగ్గాలు వేయాల్సి ఉందంటూ కొందరు ఆక్రోశం వెల్లగక్కుతున్నట్టు గుర్తించారు. చంద్రచూడ్‌ తండ్రి ప్రస్తావన తీసుకురావడం ద్వారా ప్రస్తుత సీజేఐ సామర్థ్యం, ఎదిగిన తీరును అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం ఉన్నట్టుగా భావిస్తున్నారు.

మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఎన్‌ కిర్పాల్‌ కుమారుడు సౌరబ్ కిర్పాల్‌ను న్యాయమూర్తిగా సిఫార్సు చేయడాన్ని తప్పుపడుతూ పోస్టులు కనిపిస్తున్నాయి. బీఎన్‌ కిర్పాల్‌ కుటుంబం, చంద్రచూడ్‌ కుటుంబం పరస్పరం వారి పిల్లలను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసుకుంటున్నారంటూ ట్వీట్ పెట్టడమే కాకుండా.. సుప్రీంకోర్టు మిలార్డ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని బీజేపీ అనుకూల వర్గాలు దాడి చేస్తున్నాయి. మైనార్టీ హక్కులపై చంద్రచూడ్‌ తీరును గుర్తు చేస్తూ అతడు హిందూ వ్యతిరేకి అని, హిందువులపై దాడులకు సంబంధించిన కేసుల్లో ఉదాసీనంగా ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇలా జరుగుతున్న ప్రచారంలో చాలా వరకు అసత్య సమాచారం కూడా ఉన్నట్టు అధ్యయనం గుర్తించింది.

Tags:    
Advertisement

Similar News