రైతు బీమా పేరుతో కార్పొరేట్లకు దోచిపెట్టిన మోదీ..
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ దగా మరింత పెద్ద స్థాయిలో జరిగింది. ప్రీమియం రూపంలో 27,900కోట్ల రూపాయలు వసూలు చేసిన ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు, రైతులకు కేవలం 5760కోట్ల రూపాయలు చెల్లించాయి. కొన్ని రాష్ట్రాల్లో రైతులు నష్టపోయినా రూపాయి కూడా పరిహారం కింద దక్కలేదు.
పేరుకే అది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. కానీ ఈ పథకంతో లాభపడింది మాత్రం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు. అందులో అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అధికంగా లాభపడింది. ఇవి ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ఎంతమాత్రం కాదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభలో బయటపెట్టిన గణాంకాలు. అవును, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతోందో చెప్పడానికి ఈ గణాంకాలే పెద్ద ఉదాహరణ.
57వేల కోట్లు..
గత ఏడేళ్ల కాలంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం ద్వారా కేంద్రం ప్రైవేటు బీమా కంపెనీలకు చెల్లించిన ప్రీమియం మొత్తం 1,97,657 కోట్ల రూపాయలు. అదే సమయంలో బీమా కంపెనీలు రైతులకు చెల్లించిన పరిహారం 1,40,036కోట్ల రూపాయలు. అంటే బీమా కంపెనీలకు మిగిలిన మొత్తం అక్షరాలా 57వేల కోట్ల రూపాయలన్నమాట. అటు రైతులకు అందకుండా, ఇటు ప్రభుత్వానికి మిగలకుండా.. మొత్తం ఆ సొమ్ముని బీమా కంపెనీలు లాభాలరూపంలో సొమ్ముచేసుకున్నాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమాయోజన పథకం అమలుతీరు ఎంత లోపభూయిష్టంగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతుంది.
రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 2016లో మొదలు పెట్టింది. కరువు కాటకాలు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గినా, పంట నష్టం జరిగినా, బీమా కంపెనీలు నష్టపరిహారం చెల్లించేవి. అయితే అంతకంటే ఎక్కువగా ఆ కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం రూపంలో సొమ్ము చెల్లించేది. సహజంగా ఆ రెండిటి మధ్య అంతరం ఎక్కువగా ఉంటే అది రైతులకే లాభం కావాలి. కానీ ఇక్కడ బీమా కంపెనీలకు ఆ లాభం చేకూర్చింది ప్రభుత్వం. అది కూడా ప్రైవేటు కంపెనీలకు దోచి పెట్టింది. కార్పొరేట్లపై మోదీకి ఉన్న ప్రేమకు ఇది మరో నిదర్శనం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ దగా మరింత పెద్ద స్థాయిలో జరిగింది. ప్రీమియం రూపంలో 27,900కోట్ల రూపాయలు వసూలు చేసిన ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు, రైతులకు కేవలం 5760కోట్ల రూపాయలు చెల్లించాయి. కొన్ని రాష్ట్రాల్లో రైతులు నష్టపోయినా రూపాయి కూడా పరిహారం కింద దక్కలేదు.