సీ-295 విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించిన ప్రధాని

ఈ కార్యక్రమానికి ముందు మోదీ, పెడ్రో సాంచెజ్‌ వడోదరాలో రోడ్‌ షో నిర్వహించారు.

Advertisement
Update:2024-10-28 10:53 IST

గుజరాత్‌లోని వడోదరలో సీ-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడీ స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెత్‌తో కలిసి ప్రారంభించారు. టాటా అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌కు చెందిన ఈ కర్మాగారానికి 2022 అక్టోబర్‌లో మోదీ శంకుస్థాపన చేశారు. భారత్‌కు 56 సీ-295 విమానాల సరఫరాకు 2021 సెప్టెంబర్‌లో రూ. 21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్‌ సంస్థ కర్మాగారం నుంచి అందుతాయి. మిగతావి వడోదర యూనిట్‌లో సిద్ధమౌతాయి. కాలం చెల్లిన ఆవ్రో-748 విమానాల స్థానంలో భారత వాయుసేన వీటిని ప్రవేశపెట్టనున్నది. సీ-295కు సంబంధించి వివిభాగాల ఉత్పత్తి హైదరాబాద్‌లోని 'మెయిన్‌ కన్‌స్టిట్యూయెంట్‌ అసెంబ్లీ'లో ఇప్పటికే ప్రారంభమైంది.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్‌-స్పెయిన్‌ సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు. భారత్‌లో విమానాలు తయారు చేసి ఎగుమతి చేస్తామన్నారు. భారత్‌ను విమానయాన హబ్‌గా మారుస్తామని ప్రధాని తెలిపారు. భారత్‌-స్పెయిన్‌ భాగస్వామ్యాన్ని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సరికొత్త మార్గంలో తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ఆ సమయంలో ఇంత పెద్ద రక్షణ పరిశ్రమ భారత్‌లో ఏర్పాటవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇటీవల భారత్‌ తన ముద్దు బిడ్డ రతన్‌ టాటాను కోల్పోయింది. ఇవాళ ఆయన ఇక్కడ ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు. ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తుంది.స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ మాట్లాడుతూ.. ఎయిర్‌బస్‌, టాటాల భాగస్వామ్యం భారత వైమానిక రంగ పురోగతికి బాటలు వేస్తుందన్నారు. ఇతర ఐరోపా దేశాలు భారత్‌కు రావడానికి ఇది ద్వారాలు తెరిచిందన్నారు. 

ఈ కార్యక్రమానికి ముందు మోదీ, పెడ్రో సాంచెజ్‌ వడోదరాలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంపై రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ ఎక్స్‌లో స్పందిస్తూ అక్టోబర్‌ 28 భారత వైమానిక రంగంలో ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించారు. దీని ప్రారంభోత్సవంలో ఆయన కూడా పాల్గొన్నారు.


 

Tags:    
Advertisement

Similar News