2047 నాటికి భవ్య భారత్.. రాష్ట్రపతి ముర్ము తొలి సందేశం..

యువత నడుం బిగించి ఈ కల సాకారానికి కృషి చేయాలన్నారు. అప్పుడే భారతీయులుగా మన మనుగడకు సార్థకత లభిస్తుందని చెప్పారు.

Advertisement
Update:2022-08-15 07:04 IST

భారత స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. 75 ఏళ్ల స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న మనం మరో పాతికేళ్లు గడిచేలోగా భవ్య భారత్ నిర్మాణానికి సిద్ధ‌మవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. వందేళ్ల స్వతంత్ర భారతావని మన స్వాతంత్ర సమర యోధులు కన్న కలలను సాకారం చేసేదిగా ఉండాలన్నారు. యువత నడుం బిగించి ఈ కల సాకారానికి కృషి చేయాలన్నారు. అప్పుడే భారతీయులుగా మన మనుగడకు సార్థకత లభిస్తుందని చెప్పారు.

75 ఏళ్లు గడవడం స్వతంత్ర భారత్ కి ఒక రెప్పపాటులాంటిదేనన్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. అయితే వ్యక్తిగతంగా మనందరికీ అది ఒక జీవితకాలం అని చెప్పారు. ఇప్పటి వరకూ మనందరం నేర్చుకున్న పాఠాలు మరో మైలురాయి దిశగా యావత్ భారత జాతి ముందడుగు వేయడానికి ఉపయోగపడ్డాయని అన్నారు. దినదిన ప్రవర్ధమానమవుతున్న భారత్‌ ను ఇప్పటి వరకూ ప్రపంచం చూసిందని, కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన వేళ.. భారత్ మాత్రం కలసికట్టుగా ముందగుడు వేసిందని, మహమ్మారిని ఎదుర్కోవడంలో మనం సాధించిన లక్ష్యాలు, అభివృద్ధి చెందిన దేశాలకంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో భారతదేశ పేదరికం, నిరక్షరాస్యతల దృష్ట్యా ప్రజాస్వామ్య రూపంలో ప్రభుత్వం మనగలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమయినా అది తప్పని రుజువు చేసి ప్రజాస్వామ్యం పరిడ‌విల్లేలా చేశామని చెప్పారామె. దేశవ్యాప్తంగా అభివృద్ధి కళ కనిపిస్తోందని అన్నారు. ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాలు దీర్ఘకాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయని చెప్పారు.

సామాజిక, రాజకీయ ప్రక్రియలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం ఎన్నో విజయాలకు దారి తీసిందని చెప్పారు ముర్ము. ఆడబిడ్డలే దేశ ఆశా దీపాలని కొనియాడారు. యుద్ధ విమాన పైలట్ల నుంచి అంతరిక్ష శాస్త్రవేత్తల వరకు మన ఆడబిడ్డలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కూడిన భారతావని.. 'ఏక్‌భారత్‌- శ్రేష్ట్ భారత్‌' స్ఫూర్తితో ముందడుగు వేసేందుకు స్ఫూర్తినిస్తోందని అన్నారు. మాతృదేశంతో పాటు, తోటి భారతీయుల అభ్యున్నతి కోసం మనందరం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భవ్యభారత్ కల సాకారం కావాలని, అందుకు యువత సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News