టీ-హబ్ స్పూర్తితో మహారాష్ట్రలో ఎం-హబ్ ఏర్పాటుకు సన్నాహాలు

టీ-హబ్ విజయాన్ని చూసిన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ కూడా నూతన ఆవిష్కరణలకు చేయూత ఇవ్వాలని నిర్ణయించింది.

Advertisement
Update:2023-06-10 08:04 IST

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దేశమంతటా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పక్కనే ఉన్న మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో అక్కడ తెలంగాణ మాడల్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో మాకు కూడా తెలంగాణ లాంటి అభివృద్ధి కావాలనే డిమాండ్ వస్తోంది. ఇక హైదరాబాద్ నగరం ఇప్పుడు బెంగులూరుతో సరిసమానంగా ఐటీ ఉత్పత్తులను ఇస్తూ దూసుకొని పోతోంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే టీ-హబ్ పేరుతో ఒక స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించారు. అది విజయవంతం కావడంతో రెండో దశ టీ-హబ్ ప్రారంభించారు. ఇక్కడ స్టార్టప్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

టీ-హబ్ విజయాన్ని చూసిన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ కూడా నూతన ఆవిష్కరణలకు చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం ఎం-హబ్ పేరుతో ఒక ఇంక్యుబేటర్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీని కోసం కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవల పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో మహారాష్ట్ర హబ్ (ఎం-హబ్) పేరుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంతో పాటు నాలెడ్జ్ లీడ్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నది.

కాగా, ఎం-హబ్ ఏర్పాటు కోసం తమకు తగిన సహాయ సహకారాలు అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తమ సహాయం కోరినట్లు టీ-హబ్ సీఈవో శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. రెండు నెలల క్రితమే మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు టీ-హబ్‌ను సందర్శించి ఇక్కడ జరుగుతున్న ఆవిష్కరణలు, ఇతర విషయాలను కూలంకషంగా తెలుసుకున్నట్లు శ్రీనివాస్ చెప్పారు. ఎం-హబ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తున్నట్లు అప్పుడే అధికారులు వెల్లడించారని అన్నారు.

సెమీ కండక్టర్ల రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ-హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌తో కలిసి తొలి సారిగా టీ-హబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని సెమీ కండక్టర్ రంగానికి చేయూతనిచ్చేలా మంచి పని తీరు కనపరిచిన 10 స్టార్టప్‌లను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన స్టార్టప్‌లకు ఏంజిల్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.6 కోట్లు సమకూరాయని చెప్పారు. మరో రూ.3 కోట్ల కోసం చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News