నితీష్ కుమార్ వయస్సు ఆయనను భ్రమల్లో పడేసి ఒంటరిని చేస్తోంది': ప్రశాంత్ కిషోర్ సెటైర్లు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ప్రశాంత్ బీజేపీ కోసం పనిచేస్తున్నాడని నితీష్ ఆరోపణలు చేయగా, నితీష్ కుమార్ కువయసు పైబడి ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఉంటున్నారని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆదివారం నాడు దుమ్మెత్తి పోశారు. నితీష్ కుమార్ వయసు పైబడిందని, వయో భారంతో భ్రమల్లో ఉంటూ ఒంటరిగా మిగిలిపోతున్నారని విమర్శించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఉంటున్నారని అన్నారు. కుమార్ పై వయస్సు ప్రభావంచూపుతోందని, అది అతని బలహీనతగా కనిపిస్తోందని అన్నారు.
జనతాద దళ్ (యు) లో చేరి సారధ్యం వహించాలని కోరాననడం, ఆ తర్వాత తాను బిజెపి కోసం పనిచేస్తున్నానని చెప్పడం వంటివన్నీ ఆయన బలహీనతలకు అద్దం పుడుతున్నాయన్నారు. బీహార్‌లో 'జన్ సూరాజ్'ని తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ ఇటీవల రాష్ట్రవ్యాప్త 'పాదయాత్ర' ప్రారంభించారు.
"నేను బిజెపి ఎజెండాపై పని చేస్తున్నానని, కాంగ్రెస్‌లో జెడియు ను విలీనం చేయమని ఆయన (కుమార్)ను కోరానని చెబుతున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది.? నేను బిజెపికి మద్దతు ఇస్తుంటే, నేను కాంగ్రెస్‌ను బలపరచమని ఎందుకు ఆయన్ను అడుగుతాను? " అని కిషోర్ ప్రశ్నించారు. అందువల్ల ఇవి తప్పుడు ఆరోపణలు అన్నారు.
"నితీష్ కుమార్ పై వయస్సు ప్రభావం చూపుతోంది. భ్రమల్లో మునిగిపోతున్నాడు. ఆయన చుట్టూ విశ్వసించని వ్యక్తులు ఉండడంతో అతను రాజకీయంగా ఒంటరి అవుతున్నాడు. ఈ భయాందోళన కారణంగానే అతను తన ఉద్దేశ్యంలో ఉన్న మాటలు కాకుండా ఏవేవో వేరేగా మాట్లాడుతున్నాడు."అని కిషోర్ అన్నాడు.
అంతకుముందు శనివారంనాడు కిషోర్, నితీష్ కుమార్ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కిషోర్ ఇప్పుడు నిరాధారమైన వాదనలు చేస్తున్నారని నితీష్ అన్నారు. తన జేడీ(యూ)ని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కొన్నేళ్ల క్రితమే కిషోర్ తనకు సలహా ఇచ్చారని అన్నారు. అక్టోబరు 5న, నితీష్ కుమార్ తన నివాసానికి తనను ఆహ్వానించాడని, తన పార్టీలో చేరి దానిని నడిపించాలని కోరారని కిషోర్ చెప్పాడు. కానీ సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పాడని కూడా తెలిపిన విషయం తెలిసిందే.