అదృష్టం కోసం నక్కను పెంచుకుంటున్న వ్యాపారి జైలుపాలు

బయటకు వెళ్లే ప్రతిసారి లక్ష్మీకాంత్ కోళ్లఫారం వద్దకు వచ్చి నక్క ముఖం చూసి వెళ్లేవాడు. అయితే నక్క ముఖం చూడటం వల్ల కలిగిన అదృష్టమో, లక్ష్మీకాంత్ చేసిన కష్ట ఫలితమో గానీ వ్యాపారంలో అతడు బాగానే లాభాలు గడిస్తున్నాడు.

Advertisement
Update:2023-03-01 15:09 IST

ఏదైనా అదృష్టం కలిసొచ్చి ఆర్థికంగా జాక్ పాట్ కొట్టినప్పుడు, లేదా మంచి జరిగినప్పుడు 'వీడు ఈరోజు నక్క తోక తొక్కి వచ్చాడురా' అనే సామెతను ఉపయోగిస్తుంటారు. అలా అదృష్టం కలిసి వస్తుందని కర్ణాటకకు చెందిన ఒక వ్యాపారి నక్కని తెచ్చి పెంచుకుంటుండగా.. ఆర్థికంగా లాభపడటం ఏమో కానీ అడవి జంతువును అక్రమంగా నిర్బంధించినందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

తుమకూరు జిల్లా నాగవల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ అనే వ్యక్తి పౌల్ట్రీఫామ్స్‌ నడుపుతున్నాడు. ఇతడు మూఢనమ్మకాలను బాగా నమ్ముతాడు. రోజూ ఉదయాన్నే నక్క ముఖం చూస్తే అదృష్టం కలిసి వస్తుందని ఎవరో చెప్పగా అది నిజమేనని భావించాడు. అందుకోసం రెండు నక్క ఫొటోలు కొని రోజూ వాటి ముఖం చూసేవాడు. అయినా పెద్దగా ఉపయోగం లేకపోవడంతో ఒక రోజు లక్ష్మీకాంత్ అడవికి వెళ్లి ఓ నక్కను పట్టుకొచ్చాడు. దాన్ని కోళ్లఫారంలోని ఓ గదిలో ఉంచి రోజు లేవగానే దాని ముఖం చూసేవాడు.

అలాగే బయటకు వెళ్లే ప్రతిసారి లక్ష్మీకాంత్ కోళ్లఫారం వద్దకు వచ్చి నక్క ముఖం చూసి వెళ్లేవాడు. అయితే నక్క ముఖం చూడటం వల్ల కలిగిన అదృష్టమో, లక్ష్మీకాంత్ చేసిన కష్ట ఫలితమో గానీ వ్యాపారంలో అతడు బాగానే లాభాలు గడిస్తున్నాడు.

అయితే లక్ష్మీకాంత్ కోళ్ల ఫారంలోని ఓ గదిలో నక్కను పెంచుతున్నట్లు గ్రామస్తులకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లక్ష్మీకాంత్ కోళ్లఫారం వద్దకు చేరుకొని అక్కడ గదిలో బంధించిన నక్కను అటవీ శాఖ అధికారులకు అప్ప‌గించారు. అడవి జంతువును అక్రమంగా పెంచుతున్నందుకు లక్ష్మీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ విషయం గురించి ఆ నోటా ఈ నోటా పడి అందరికీ తెలియగా, అదృష్టం కోసం నక్కను తెచ్చి పెట్టుకుంటే చివరికి జైలు పాలయ్యాడేంటీ? అని నవ్వుకుంటున్నారు. ఇదేనా అదృష్టం అంటే? అని పలువురు ప్రశ్నించారు. ఇంకా ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు నమ్మడం ఏంటి సోదరా..అని పలువురు లక్ష్మీకాంత్ కు హితవు పలికారు.

Tags:    
Advertisement

Similar News