'చెరువు' దొంగతనం.. నమ్మండి ఇది నిజం

రాత్రికి రాత్రే ఓ చెరువుని దొంగతనం చేశారు కేటుగాళ్లు. అక్కడ అసలు చెరువు ఆనవాళ్లే లేకుండా చేశారు. నీటితోపాటు, ఖాళీ స్థలం కూడా మాయమైంది, అది కూడా ఒక రాత్రిలోనే.

Advertisement
Update:2024-01-02 11:05 IST

సైకిల్ దొంగతనం, స్కూటర్ దొంగతనం, మహిళల మెడలో చైన్లు దొంగతనం, సెల్ ఫోన్ దొంగతనం.. ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో కామన్. కానీ బీహార్ లో మాత్రం వెరైటీ దొంగతనాలు జరుగుతుంటాయి. అసలు ఇలాంటి వస్తువుల్ని కూడా దొంగిలిస్తారా, ఎవరికీ తెలియకుండా వాటిని తరలిస్తారా అని జనం ఆశ్చర్యపోయేలా అక్కడ చోర శిఖామణులు హస్తలాఘవం చూపిస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగతనం. రాత్రికి రాత్రే ఓ చెరువుని దొంగతనం చేశారు కేటుగాళ్లు. చెరువు అంటే చెరువులో నీళ్లు దొంగిలించుకుపోయారనుకుంటే పొరపాటే. అక్కడ అసలు చెరువు ఆనవాళ్లే లేకుండా చేశారు. నీటితోపాటు, ఖాళీ స్థలం కూడా మాయమైంది, అది కూడా ఒక రాత్రిలోనే.

బీహార్ లో దొంగతనాలు భలే వెరైటీగా జరుగుతుంటాయి. కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ రాత్రికి రాత్రే మాయం చేస్తుంటారు. పాడుబడిపోయిన రైల్వే బ్రిడ్జ్ లు కూడా ఒక్క రాత్రిలోనే అక్కడినుంచి తరలించేస్తారు. రైల్వే ఇంజిన్లు సైతం రిపేరింగ్ వర్క్ షాప్ నుంచి మాయం చేస్తారు. పార్ట్ లు పార్ట్ లుగా ఊడదీసి తీసుకెళ్లిపోయిన ఉదాహరణలు బీహార్ లో ఉన్నాయి. అయితే తాజాగా బీహార్ లో చెరువు మాయం కావడం వీటన్నిటికీ పరాకాష్ట అని చెప్పుకోవాలి. మన దగ్గర జరిగే చెరువు కబ్జాతో దీన్నిపోల్చలేం. ఇక్కడ రోజుల తరబడి చెరువుల్లో మట్టి పోసి కబ్జా చేస్తారు. కానీ బీహార్ లో రాత్రికి రాత్రే చెరువు మాయం చేసి, గుడిసె వేశారు.

బీహార్ లోని దర్భంగ జిల్లాలో వందలాది చెరువులు ఉన్నాయి. స్థానిక రైతులు ఈ చెరువుల ఆధారంగా వ్యవసాయం చేస్తుంటారు. కొన్ని చోట్ల రైతులు వ్యవసాయం వదిలేసినా చెరువులు మాత్రం అలాగే ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. నీమ్ పోఖర్ ప్రాంతంలో కూడా ఇలాగే చెరువులు ఉన్నాయి. ఇక్కడ ఓ చెరువు రాత్రికి రాత్రే మాయమైపోయింది. అసలక్కడ చెరువు ఆనవాళ్లు ఏమాత్రం లేవు. చెరువుని పూర్తిగా పూడ్చివేసి, ఆ ప్రాంతంలో ఓ గుడిసె వేశారు. గుడిసె ముందు నాలుగు కుర్చీలు, చిన్న చిన్న మొక్కలు పెట్టేశారు. సడన్ గా ఆ గుడిసెను చూసిన వారికి అక్కడ ఓ చెరువు ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా చేశారు. ఈ ఘటనతో స్థానికులు షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చెరువుని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    
Advertisement

Similar News