ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్.. వర్చువల్గా వాదనలు
ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచన
దేశ రాజధానిలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు భారత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. దిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నందున వీలైతే లాయర్లు వర్చువల్ గా వాదనలు వినిపించాలని సూచించినట్లు వెల్లడించారు. కాలుష్య అంశం చేయి దాటిపోయిందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు.
జీఆర్పీఏ-4 (GRAP-IV) పరిమితులు పరిగణనలోకి తీసుకొని ఢిల్లీలోని కోర్టులు పూర్తిగా వర్చువల్ విధానాన్ని అనుసరించాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ శంకర్ నారాయణన్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. దీంతో ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు.
ఢిల్లీలో వాయుకాలుష్యం క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. మంగళవారం సగటు గాలి నాణ్యతా సూచీ (AQI) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్ దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనివల్ల ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాయు కాలుష్యంపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే ఫస్ట్ నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లు నిర్వహిస్తున్నారు.