ఢిల్లీలో మళ్లీ కాలుష్యం.. పిల్లలకు శ్వాసకోశ సమస్యలు
తాజాగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 408గా నమోదైంది. ఈ సూచీ 401 నుంచి 500 మధ్యలో ఉంటే దాన్ని తీవ్ర స్థాయిగా పరిగణిస్తారు.
దీపావళి రోజు టపాకాయలు కాలిస్తే జరిమానా వేస్తాం, జైలుశిక్ష వేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదు. టపాకాయల మోత మోగించారు. ఇప్పుడు వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్నారు. పూర్తిగా టపాకాయలు కాల్చడం వల్లే ఈ అనర్థం జరిగిందని చెప్పలేం కానీ, అది కూడా పరోక్ష కారణంగా నిలిచింది. శీతాకాలం మొదలయ్యే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడంతో ఢిల్లీలో కాలుష్యం పాళ్లు మరింత పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 408గా నమోదైంది. ఈ సూచీ 401 నుంచి 500 మధ్యలో ఉంటే దాన్ని తీవ్ర స్థాయిగా పరిగణిస్తారు. అంటే ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.
పిల్లలకు శ్వాసకోశ సమస్యలు..
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగితే ఏమవుతుంది..? పొగమంచు వల్ల ఉదయం వేళ ప్రయాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి, ప్రమాదాలకు అవకాశం ఎక్కువ, విమాన ప్రయాణాలు ఆగిపోతాయి. ఇలా చాలా అనర్థాలున్నాయి. వీటితోపాటు మానవ జీవనంపై కూడా తీవ్ర ప్రభావం కనపడుతుంది. చిన్నారులు, వృద్ధులు శ్వాస సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇల్లు దాటి కదల్లేని పరిస్థితి. కొన్నిచోట్ల ఇళ్లలో ఉన్నా కూడా స్వచ్ఛమైన గాలి పీల్చలేని దుస్థితి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని స్కూళ్లకు పంపించవద్దని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచిస్తోంది. కొన్నిరోజులపాటు స్కూళ్లను మూసివేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది.
శాశ్వత పరిష్కారం ఏంటి..?
టపాకాయలపై నిషేధం, నిర్మాణ పనుల్ని తాత్కాలికంగా నిలిపివేయడం, సరి-బేసి విధానంలో వాహనాలకు అనుమతివ్వడం.. ఇలాంటి ప్రయోగాలతో ఫలితం లేదని తేలిపోయింది. కరోనా టైంలో మాత్రం హడావిడి లేకపోవడంతో ఢిల్లీలో గాలి నాణ్యత బాగా పెరిగింది. అంటే ఢిల్లీలో ఉన్న జనసమ్మర్దమే దీనంతటికీ కారణం అన్నమాట. హడావిడి జీవితంలో మనం వినియోగించే ప్రతి వస్తువూ పరోక్షంగా వాయు కాలుష్యానికి కారణం అవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనేలోపు ఎన్ని వేల జీవితాలు ఖర్చయిపోతాయోననే ఆందోళన అందరిలో ఉంది. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కఠిన నిబంధనలతో అవస్థలు పడినా భవిష్యత్ తరాలకు మంచి జరగాలంటే మాత్రం ఢిల్లీ విషయంలో ఏదో ఒక ప్రయత్నం మొదలు కావాల్సిందే.