హంతకులను పట్టుకోవడానికి 'బాబా' శరణుజొచ్చిన పోలీసులు
ఓ బాలిక హత్యకేసును ఛేదించలేని పోలీసులు బాబాను ఆశ్రయించారు. బాబా చెప్పాడని మృతురాలి మేనమామ మీదనే కేసు నమోదు చేశారు. ఇది బహిర్గతమవడంతో ఉన్నతాధికారులు ఓ పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు.
ఏదైనా నేరం జరిగితే కాపాడమని మనం పోలీసుల దగ్గరికి పరిగెడతాం. వాళ్ళు విచారణ జరిపి దోషులను పట్టుకుంటారని మనం నమ్ముతాం. అయితే ఆ పోలీసులే దోషులను పట్టుకోవడానికి బాబాలను, మంత్రగాళ్ళను, జ్యోతీష్యులను ఆశ్రయిస్తే...?
మధ్యప్రదేశ్ లో అదే జరిగింది. ఓ హత్య కేసులో దోషులను పట్టుకోవడం చేతకాని ఓ పోలీసు అధికారి సహాయం చేయమని ఓ బాబాను ఆశ్రయించాడు.
ఛతర్‌పూర్ జిల్లా బమితా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓటపూర్వ గ్రామంలో జులై 28న ఓ బావిలో 17 ఏళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామస్తులైన రవి అహిర్వార్, గుడ్డా అలియాస్ రాకేష్, అమన్ అహిర్వార్ హత్యకు పాల్పడ్డారని బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
అయితే ఆ తర్వాత తగిన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు వారిని విడిచిపెట్టారు. అకస్మాత్తుగా కొన్ని రోజుల తర్వాత బాలిక మేనమామ తిరత్ అహిర్వారే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తన మేనకోడలికి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే ఆయన ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో యువతి బంధువులు షాక్‌కు గురయ్యారు.
ఆ తర్వాత ఓ వీడియో బైటికి రావడంతో బాలిక బంధువులే కాదు అధికారులు కూడా షాక్ కు గురయ్యారు.
ఆ వీడియో ప్రకారం... బాలికను హత్య చేసిన నిందితులెవరో కనిపెట్టడం పోలీసుల వల్ల కాకపోవడంతో బమితా పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ శర్మ, బాబా పండోఖర్ సర్కార్ అనే బాబాను ఆశ్రయించాడు. నిందితుడు మజ్‌గువాన్ ప్రాంతానికి చెందినవాడని, ఈ కేసులో అతనే కీలక నేరస్థుడని బాబా ఆ వీడియోలోచెప్పాడు. దాని ఆధారంగానే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ శర్మ, హత్యకు గురైన బాలిక మేనమామ పై కేసు దాఖలు చేశాడు.
ఈ విషయం బైటపడటంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అనిల్ శర్మను సస్పెండ్ చేసినట్టు సూపరింటెండెంట్ సచిన్ శర్మ ప్రకటించారు. తదుపరి విచారణ బాధ్యతలను సబ్ డివిజనల్ పోలీసు అధికారి మన్మోహన్ సింగ్ బఘెల్‌కు అప్పగించారు.
నేరం జరిగినప్పుడు ఇలా పోలీసులే బాబాల దగ్గరికి వెళ్తే ప్రజలు మాత్రం బాబాల దగ్గరికి కాకుండా పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్తారు ?