ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం.. - మృతుల్లో ఒక ఎస్ఐ, ముగ్గురు హోం గార్డులు
ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని అలకనందా నదిపై ఉన్న ఓ వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ట్రాన్స్‌ఫార్మర్ పేలి.. విద్యుత్ షాక్‌కు గురై 15 మంది మృతిచెందిన ఘటన బుధవారం ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు. ఈ ఘటనలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని అలకనందా నదిపై ఉన్న ఓ వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నమామీ గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనందా నదిపై ఉన్న వంతెనకు విద్యుత్ సరఫరా కావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడం వల్ల వంతెన రెయిలింగ్‌కి విద్యుత్ సరఫరా జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ అడిషనల్ డీజీపీ వి.మురుగేశన్ మాట్లాడుతూ వంతెన రెయిలింగ్‌కి విద్యుత్ ప్రవాహం జరగడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నామన్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం పరిశీలించనున్నారు.