ప్రపంచ శాంతి కోసం అందరూ కలిసి రావాలి.. జీ20 సదస్సులో ప్రధాని మోడీ
రెండో ప్రపంచ యుద్ధం విధ్వంసానికి కారణమైంది. కానీ అప్పటి దేశాధినేతలు శాంతిని నెలకొల్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చిందని ప్రధాని మోడీ అన్నారు.
ప్రపంచ శాంతి కోసం అన్ని దేశాలు కలిసి రావల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోడీ అన్నారు. ఇండియోనేషియాలోని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో ప్రధాని మోడీ పాల్గొని, కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంపై ఆయన స్పందించారు. కాల్పుల విరమణ, దౌత్య పరంగా ప్రపంచం ఇప్పుడు ఒక మార్గాన్ని వెతకాలని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కడ శాంతి నెలకొల్పేందుకు యావత్ ప్రపంచం సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. కోవిడ్ తర్వాత కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత మనందరిపైనా ఉందని ప్రపంచ దేశాధినేతలకు పిలుపునిచ్చారు.
రెండో ప్రపంచ యుద్ధం విధ్వంసానికి కారణమైంది. కానీ అప్పటి దేశాధినేతలు శాంతిని నెలకొల్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో శాంతి, సామరస్యం, భద్రతను కల్పించడానికి కచ్చితమైన, సామూహిక సంకల్పాన్ని ప్రదర్శించడం అవసరమని ఆయన అన్నారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ద పరిస్థితుల కారణంగా ప్రపంచం మరోసారి విధ్వంసం వైపునకు వెళ్లే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిణామాల వల్ల ప్రపంచ సప్లై చెయిన్ శిథిలావస్థకు చేరుకున్నదన్నారు.
ఈ సమయంలో మనందరం ఏకం కావల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ సమిష్టి సంకల్పంతో ముందుకు వెళ్లడం చాలా అవసరం అని మోడీ చాటి చెప్పారు. బుద్ధుడు, గాంధీ మహాత్ముడు నడయాడిన నేలలో వచ్చే ఏడాది జీ-20 సదస్సు జరుగనున్నది. ఆ వేదికగా ప్రపంచ శాంతికి బలమైన సందేశం ఇస్తామని ఇండియా విశ్వాసంగా ఉందని మోడీ అన్నారు. రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లపై పశ్చిమ దేశాల ఆంక్షలపై కూడా మోడీ స్పందించారు. ప్రపంచ వృద్ధికి భారత ఇంధన భద్రత కూడా అత్యంత ముఖ్యమైనదని మోడీ చెప్పారు. ఇలాంటి సమయంలో ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షలు, పరిమితులను మనం ప్రోత్సహించకూడదని, ఎనర్జీ మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకొని రావాలని మోడీ ఆకాంక్షించారు.
పర్యవరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధనానికి భారత్ కట్టుబడి ఉన్నదని ప్రధాని స్పష్టం చేశారు. 2030 నాటికి మా విద్యుత్‌లో సంగం పునరుత్పాదక వనరుల నుంచే వస్తుందని చెప్పారు. పునరుత్పాదక వనరుల ఇంధన ఉత్పత్తి కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థిరమైన సాంకేతికను అందించాలని, ఆర్థికంగా అండగా ఉండాలని మోడీ కోరారు. ఇక భారత్‌లో ఆహార భద్రత గురించి కూడా మోడీ ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఫెర్టిలైజర్స్ కొరత ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చిని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని ముఖ్యమైన సమస్యలపై ప్రపంచ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి భారత్ కృషి చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.