ఉపరాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం - ప్రధాని మోడీ

ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసి విషయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు ఎంపీలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Advertisement
Update:2023-12-20 14:45 IST

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అవమానకరంగా మిమిక్రీ చేయడం దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. శీతకాల సమావేశాల నుంచి సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో మంగళవారం ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఉప రాష్ట్రపతిని అనుకరిస్తూ హేళన చేశాడు. మకర ద్వారం మెట్ల వద్ద పలువురు ఎంపీల మధ్య కూర్చున్న కళ్యాణ్ బెనర్జీ మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిలా కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేశారు.

ఆ సమయంలో పక్కనే ఉన్న రాహుల్ గాంధీ దానిని వీడియో తీశారు. ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతిని అనుకరిస్తూ హేళన చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో టీఎంసీ ఎంపీపై ఫిర్యాదు కూడా నమోదయింది.

కాగా, తాజాగా ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసి విషయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు ఎంపీలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రధాని మోడీ తనకు ఫోన్ చేశారని, కొంతమంది ఎంపీల ప్రవర్తనపై బాధపడిన‌ట్లు చెప్పారు.

టీఎంసీ ఎంపీ మిమిక్రీ చేసి హేళన చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. 20 ఏళ్లుగా తాను కూడా ఇలాంటి అవమానాలు అనుభవిస్తున్నట్లు ప్రధాని తనతో చెప్పారని తెలిపారు. కొంతమంది ఎంపీలు హేళన చేసినంత మాత్రాన తనను నిరోధించలేరని తాను మోడీకి చెప్పానన్నారు. తనను అవమానించినా తన మార్గం మారదని మోడీకి చెప్పినట్లు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News