విహార యాత్ర విషాదాంతం.. - జలపాతంలో ముగ్గురు మృతి, ఇద్దరి గల్లంతు

వారు ప్రమాదం నుంచి బయటపడేందుకు రక్షణ కోసం కేకలు కూడా పెట్టారు. అయినా వారిని అక్కడ ఉన్నవారు కాపాడలేకపోయారు. నీటి ఉద్ధృతి పెరగడంతో కుటుంబ సభ్యులందరూ అందులో జారి పడిపోయారు.

Advertisement
Update: 2024-07-01 02:51 GMT

విహార యాత్ర ఓ కుటుంబానికి విషాదాంతమైంది. జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన ఏడుగురితో కూడిన ఓ కుటుంబంలో మహిళతో పాటు నలుగురు చిన్నారులు నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని లోనావాలాలో గల డ్యామ్‌ సమీపంలో జలపాతం, హిల్‌ స్టేషన్‌ ఉన్నాయి. ఇవి ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటిని సందర్శించేందుకు ఏడుగురితో కూడిన ఒక కుటుంబం ఆదివారం విహార యాత్రకు వెళ్లింది. జలపాతాన్ని సందర్శిస్తుండగా నీటి ఉద్ధృతి భారీగా పెరిగింది. ఆదివారం తెల్లవారు జామున ఆ ప్రాంతంలో పడిన భారీ వర్షం కారణంగా ఈ పరిస్థితి చోటుచేసుకుంది. వారు ప్రమాదం నుంచి బయటపడేందుకు రక్షణ కోసం కేకలు కూడా పెట్టారు. అయినా వారిని అక్కడ ఉన్నవారు కాపాడలేకపోయారు. నీటి ఉద్ధృతి పెరగడంతో కుటుంబ సభ్యులందరూ అందులో జారి పడిపోయారు.

ఈ ఘటన నుంచి ఒక పురుషుడు, మరొకరు మాత్రమే ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలిగారు. కానీ మహిళ (40), ముగ్గురు బాలికలు, ఒక బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి రిజర్వాయర్లో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో మహిళ, ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు. మిగతా ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదం నేపథ్యంలో జలపాతం వద్ద సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News