సుప్రీంలో ఉచితాల పిటిషన్లు.. మోదీకి దిమ్మతిరిగే కౌంటర్లు..

ఆర్టికల్‌-38 ప్రకారం సామాజిక క్రమాన్ని, ఆర్థిక న్యాయాన్ని కాపాడే లక్ష్యంతో సంక్షేమ పథకాల ద్వారా ఉచిత సేవలు ప్రజలకు అందిస్తున్నామని, దాన్ని ఉచితాల పేరుతో అవహేళన చేయడం, ఆపేయాలని చూడటం తగదని పేర్కొంది.

Advertisement
Update:2022-08-17 08:04 IST

ఉచితాల తేనెతుట్టెను కదిపిన కేంద్రం.. ఇప్పుడు తనకు తానే టార్గెట్ అవుతోంది. ఉచిత పథకాలు పేదలకు మేలు చేస్తుంటే బీజేపీకి కంటగింపుగా ఉందని, కార్పొరేట్లకు మాత్రం వేలకోట్లు దోచిపెడుతోందని వైరి వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశంపై పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ వ్యవహారంతో కేంద్రం అనుకోకుండా పేదల వ్యతిరేకి అనే ముద్ర వేయించుకుంటోంది.

ఎన్నికల సమయంలో ఉచిత హామీలను అడ్డుకోవాలని కోరుతూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కి కౌంటర్లు దాఖలు చేస్తున్నారు ఇతర పార్టీల నేతలు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ పిటిషన్ ని సుప్రీంలో సవాల్ చేశారు. తాజాగా తమిళనాడుకి చెందిన డీఎంకే పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉచిత పథకాలు అనే అంశం చాలా విస్తృతమైందని, ఇందులో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆర్టికల్‌-38 ప్రకారం సామాజిక క్రమాన్ని, ఆర్థిక న్యాయాన్ని కాపాడే లక్ష్యంతో సంక్షేమ పథకాల ద్వారా ఉచిత సేవలు ప్రజలకు అందిస్తున్నామని, దాన్ని ఉచితాల పేరుతో అవహేళన చేయడం, ఆపేయాలని చూడటం తగదని పేర్కొంది.

అవి ఉచితాలు కావా..?

రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే హామీలే ఉచితాలా..? కేంద్రం కార్పొరేట్లకు దోచిపెట్టేవాటిని ఉచితాలు అనకూడదా అని ప్రశ్నించింది డీఎంకే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విదేశీ కంపెనీలకు ట్యాక్స్‌ హాలిడేలు ఇస్తోందని, దాన్ని ఏమనాలని పిటిషన్లో కోరింది. కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేయడాన్ని ఎలా పరిగణించాలని అడిగింది. అనుకూల వ్యక్తులకు కీలకమైన ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పగించడాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది డీఎంకే. ఇలాంటి వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని వేటిని ఉచితాలు అనాలి, వేటిని సంక్షేమ పథకాలు అనాలి, వేటిని కార్పొరేట్ల దోపిడీ పథకాలు అనాలో తేల్చాలని కోరింది. ఉచితాల ప్రస్తావన తీసుకొచ్చి కేంద్రం ఇప్పుడు ఇరుకున పడిందని అర్థమవుతోంది. కేంద్రం కార్పొరేట్ల పక్షపాతి అని, వేలకోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందనే భావన సుప్రీంకోర్టు సాక్షిగా బయటపడుతోంది.

Tags:    
Advertisement

Similar News