గుజరాత్ మత కలహాలపై బీబీసీ డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీం లో పిటిషన్లు
సీనియర్ న్యాయవాది M.L శర్మ ఒక పిటిషన్ దాఖలు చేయగా, జర్నలిస్టు ఎన్. రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తదితరులు కూడా వేర్వేరుగా సీనియర్ న్యాయవాది సియు సింగ్ ద్వారా పిటిషన్లు దాఖలు చేశారు.
2002 గుజరాత్ అల్లర్లు, అందులో నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది.
న్యాయవాది M.L శర్మ ఒక పిటిషన్ దాఖలు చేసినట్లు LiveLaw నివేదించింది. ఈ డాక్యుమెంటరీని నిషేధించే చర్యను ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం" అని తన పిటిషన్ లో పేర్కొన్నారు శర్మ .
మరో వైపు జర్నలిస్టు ఎన్. రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తదితరులు కూడా వేర్వేరుగా సీనియర్ న్యాయవాది సియు సింగ్ ద్వారా పిటిషన్లు దాఖలు చేశారు.
డాక్యుమెంటరీపై రామ్, భూషణ్ చేసిన ట్వీట్లను సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ప్రభుత్వం ఆదేశాలతో తొలగించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత డాక్యుమెంటరీ యూట్యూబ్ లింక్‌లు కూడా తొలగించారు.
కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తూ విడుదల చేసిన ఆర్డర్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదని సింగ్, తన క్లయింట్ల తరపున పిటిషన్ లో పేర్కొన్నారు.
డాక్యుమెంటరీని నిరోధించడం పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని ఆ పిటిషన్ పేర్కొంది.
"డాక్యుమెంటరీలోని విషయాలు ప్రజలు తెలుసుకోవడం, ఇంటర్వ్యూ చేసిన వారందరి అభిప్రాయాల గురించి దేశంలోని ఇతర పౌరులు చర్చించడం కోసం ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేయడం మీడియా ప్రాథమిక హక్కు." అని సింగ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఒక ప్రభుత్వం తనపై విమర్శలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని కూడా పిటిషన్ పేర్కొంది.
"ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు తమపై విమర్శలను అంగీకరించేంత విశాలమైన హృదయం కలిగి ఉండాలి. విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం.'' అని పిటిషన్ పేర్కొంది.
ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను ఉల్లంఘించడం కాదని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
వచ్చే సోమవారం, ఫిబ్రవరి 6న ఈ పిటిషన్లను జాబితా చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ చెప్పారు.
మరో వైపు భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఈ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి విద్యార్థులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో కొందరు విద్యార్థులు అరెస్టయ్యారు. మరి కొందరు సస్పెండ్ అయ్యారు.మరి కొందరిని అధికారులు కట్టడి చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డాక్యుమెంటరీని వీక్షించిన వారిపై పిర్యాదు చేయడంతో అజ్మీర్‌లోని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలో డాక్యుమెంటరీని వీక్షించిన 11 మంది విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు.
న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ,జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులు డాక్యుమెంటరీని చూసేందుకు ప్రయత్నించడంతో అధికారులు విద్యుత్‌ను నిలిపివేశారు.