నలుపు దుస్తులపై నిషేధం.. పెరియార్ వర్సిటీ ప్లాన్ ఫెయిల్..!
పెరియార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం ఇవాళ జరుగనుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించానున్నారు.
కేంద్రానికి, బీజేపీయేతర రాష్ట్రాలకు మధ్య నిత్యం ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని బీజేపీయేతర ప్రభుత్వాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ఇలా పలు రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు తమిళనాట పెరియార్ వర్సిటీ కొత్త వివాదానికి తెరతీసింది.
గవర్నర్ ఆర్‌ఎన్ రవి పాల్గొననున్న సమావేశంలో నల్ల దుస్తులు ధరించకూడదని సేలం జిల్లాలోని పెరియార్ యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహార శైలిని నల్ల జెండాలతో నిరసించాలని ద్రవిడార్ విదుత్తలై ఖజగం పిలుపునిచ్చింది. తమిళనాడు సంక్షేమం కోసం రూపొందించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించింది. దీంతో పోలీసులు వర్సిటీకి కొన్ని సూచనలు చేశారు. పోలీసుల సూచనలతో స్నాతకోత్సవానికి హాజరయ్యే వారు నల్ల దుస్తులు ధరించరాదని, సెల్ ఫోన్‌లు తీసుకురావద్దని పెరియార్ యూనివర్సిటీ సర్క్యులర్ జారీ చేసింది. యూనివర్సిటీ జారీ చేసిన ఈ సర్క్యులర్ తమిళ నాట తీవ్ర దుమారం రేపుతోంది.
పెరియార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం ఇవాళ జరుగనుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించానున్నారు. ఈ కార్యక్రమంలో నిరసనలు తెలిపే అవకాశముందనే సమాచారంతో యూనవిర్సిటీ నో బ్లాక్ అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్క్యులర్‌పై మదురై సీపీఎం ఎంపీ వెంకటేశన్ ఘాటుగా స్పందించారు. పెరియార్ వాకింగ్ స్టిక్‌తో తరిమికొట్టిన సనాతనాన్ని ధరించవద్దని గవర్నర్‌కి సలహా ఇవ్వాలని పోలీసులను కోరారు.
తమిళనాడును ద్రవిడ భూమి అంటారు. ద్రవిడ ఉద్యమ నిర్మాత పెరియార్ ఈవీ రామసామి నలుపు రంగు దుస్తులతో ప్రసిద్ధి పొందారు. ఆయన ఎప్పుడు నలుపు దుస్తుల్లోనే కనిపించేవారు. నాస్తికోద్యమంలో భాగంగా ఆయన ఈ సంప్రదానికి తెరతీశారు. ద్రవిడ సంప్రదాయాన్ని గౌరవించే రాజకీయ దిగ్గజాలంతా నలుపు దుస్తులు ధరించిన వాళ్లే. నేటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. తాజా పెరియార్ వర్సిటీ ద్రవిడ సంస్కృతిని అవమానించేలా సర్క్యులర్ జారీ చేసిందంటూ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కాగా.. వర్సిటీ ప్రకటనను పోలీసులు తప్పుబట్టారు. స్నాతకోత్సవం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. కానీ, నల్ల దుస్తులు ధరించవద్దనే సూచనలను తాము యూనివర్సిటీకి చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
తాజా సర్క్యులర్‌పై సర్వత్రా వ్యతిరేకత ఎదురవ్వడంతో వర్సిటీ మెట్టు దిగక తప్పలేదు. గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. స్నాతకోత్సవ కార్యక్రమంలో నల్ల దుస్తులు ధరించవద్దనే ఆదేశాలను విరమించుకుంది.