కర్ణాటకలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయనున్న పవన్ కల్యాణ్?

పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ అగ్రనాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటకలో ప్రచారం చేయాలని హైకమాండ్ కోరినట్లు తెలుస్తున్నది.

Advertisement
Update:2023-04-05 10:41 IST

కర్ణాటక అసెంబ్లీకి వచ్చే నెల ఎన్నికల జరుగనున్నాయి. మరోసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ పలు మార్లు అక్కడ పర్యటించి ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. అయితే, బీజేపీ మాజీ నాయకుడు గాలి జనార్థన్ రెడ్డి కొత్త పార్టీ, కుమారి స్వామి జేడీఎస్ నుంచి బలమైన పోటీ నెలకొనడంతో పార్టీ కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. దక్షిణ కర్ణాటకలో ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో గాలి జనార్థన్ రెడ్డి పార్టీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ తెలుగు సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. దీంతో మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ అగ్రనాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటకలో ప్రచారం చేయాలని హైకమాండ్ కోరినట్లు తెలుస్తున్నది. అయితే జనసేన పార్టీ ముఖ్యులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పినట్లు సమాచారం. కర్ణాటకలో పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉన్నది. బెంగళూరు, బళ్లారి, గుల్బర్గా ప్రాంతాల్లో పవన్ తో ప్రచారం చేయిస్తే బీజేపీకి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయం పవన్‌తో కూడా చర్చించారని.. అమిత్ షా స్వయంగా మాట్లాడారని తెలిసింది.

పవన్ మాత్రం వెంటనే ఏమీ తేల్చలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నాళ్లుగా బీజేపీ, జనసేన మధ్య టర్మ్స్ సరిగా లేవు. ఏపీకి సంబంధించి పొత్తుల విషయం తేల్చకపోవడం.. రూట్ మ్యాప్ అడిగినా స్పందన లేకపోవడం.. అధికార వైసీపీతో బీజేపీ దగ్గరగా ఉంటుండటంతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అసంతృప్తితో ఉన్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత కూడా మూడు రోజుల పాటు అమిత్ షా కలవక పోవడంపై కూడా పవన్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకే బీజేపీ రిక్వెస్ట్‌పై వెంటనే స్పందించకుండా.. పార్టీతో మాట్లాడి చెబుతానని అన్నట్లు సమాచారం.

కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారం చేసి.. ఏపీ ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదరక పోతే పరిస్థితి ఏంటని పవన్ భావిస్తున్నారు. అప్పుడు కేవలం టీడీపీతో జతకట్టి.. బీజేపీ దోస్తీ కట్ చేసే ఏపీలో చాలా నెగెటివ్ ప్రచారం జరుగుతుందని.. అంతిమంగా వైసీపీకే లాభం చేకూరుతుందని పవన్ అంచనా వేస్తున్నారు. అందుకే కర్ణాటక ప్రచారంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తున్నది. బీజేపీ అధిష్టానం మాత్రం ఏపీలో టీడీపీతో కలిసే అవకాశాలు పెద్దగా కనపడటం లేదు. చంద్రబాబు బీజేపీ పెద్దలను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నా.. వర్క్ అవుట్ కావడం లేదు. ఇది జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News