ఢిల్లీలో జై జనసేన.. జై మోదీ
పవన్ కల్యాణ్ ని ఎన్డీఏ కూటమి మీటింగ్ కి పిలవడం గొప్ప విషయమంటూ జనసైనికులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. మిగతా అన్ని పార్టీల్లాగే బీజేపీ, జనసేనకు పెద్దపీట వేసిందని సంబరపడుతున్నారు
ఏపీలో ఉన్నప్పుడు, వారాహి యాత్రలు చేసేటప్పుడు.. ఎప్పుడూ పవన్ కల్యాణ్ జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించలేదు, దేశం వెలిగిపోతుందనీ చెప్పలేదు. కేంద్రంలో ఉన్న నాయకత్వం కారణంగా సమస్యలు పరిష్కారమవుతున్నాయని కూడా మెచ్చుకోలేదు. కానీ ఢిల్లీ వెళ్లగానే పవన్ కల్యాణ్, జై మోదీ అనేశారు. నరేంద్రమోదీ పటిష్ట నాయకత్వం దేశానికి అవసరం అని చెప్పారు. 2014లో మోదీ ప్రధాని కావడం వల్లే దేశం మరింత పటిష్టంగా తయారైందని చెప్పారు. పటిష్ట నాయకత్వం వల్ల జరిగే మేలు ఏంటనేది భారత్ మొత్తం గమనిస్తోందన్నారు. తొలిరోజు ఎన్డీఏ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్.. మోదీని ఆకాశానికెత్తేశారు.
ఆ చర్చలు లేవు..
మీటింగ్ కి ముందు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కలసి పోటీ చేసే అవకాశముందన్నారు. మీటింగ్ తర్వాత మాత్రం.. అసలిలాంటి వ్యవహారాలపై ఎన్డీఏ కూటమిలో చర్చ జరగలేదని తేల్చేశారు. దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందని స్పష్టం చేశారు. నాని ఫాల్కివాలా చెప్పినట్లు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుండె ధైర్యంతో నిలబడడమే గొప్ప విషయమన్నారు. పార్లమెంట్ మీద తీవ్రవాదుల దాడి తర్వాత తనకు కూడా అదే అనిపించిందన్నారు పవన్. ఆ బలమైన నాయకత్వం మోదీ రూపంలో దేశానికి లభించిందని చెప్పారు.
ఆహా ఓహో..
పవన్ కల్యాణ్ ని ఎన్డీఏ కూటమి మీటింగ్ కి పిలవడం గొప్ప విషయమంటూ జనసైనికులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు.. కానీ మీటింగ్ లో ప్రధాని వెనకే నిలబడ్డారు, మిగతా అన్ని పార్టీల్లాగే బీజేపీ, జనసేనకు పెద్దపీట వేసిందని సంబరపడుతున్నారు జనసేన అభిమానులు. అయితే బీజేపీ వ్యూహం వేరేలా ఉంది. విపక్షాల కూటమిని దెబ్బకొట్టేందుకు అవసరం ఉన్నా లేకున్నా అన్ని పార్టీలను పిలిచి తమ బలం ఇదీ అని చూపించుకున్నారు బీజేపీ నేతలు. ఇలాంటి టైమ్ లో కూడా కమలదళం టీడీపీని దూరం పెట్టడం మాత్రం విశేషం