పఠాన్ ఎఫెక్ట్ : 32 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో హౌస్ ఫుల్ బోర్డులు
Pathaan Movie Effect: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా కశ్మీర్‌లోని పలు థియేటర్లలో విడుదలైంది. ఆశ్చర్యకరంగా ఈ సినిమాను చూసేందుకు అక్కడి ప్రజలు ఎగబడుతున్నారు.
కశ్మీర్ అంటే గుర్తుకు వచ్చేది తుపాకుల కాల్పులు.. ఉగ్రవాదుల దాడులు. అక్కడి ప్రజలు స్వేచ్ఛ లేని జీవితం గడుపుతుంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా ఆంక్షలు ఉంటాయి. చివరికి వినోదం కోసం సినిమాలకు వెళ్లాలన్నా అదే పరిస్థితి. ఇంటి గడప దాటి సినిమా హాళ్లకు వచ్చేవారు లేక కశ్మీర్‌లో ఏళ్లకేళ్లు థియేటర్లను మూసివేసిన ఘటనలూ ఉన్నాయి. అయితే ఏడాది కిందట మళ్లీ కశ్మీర్‌లో థియేటర్లను పునః ప్రారంభించారు. కొత్త థియేటర్లను కట్టుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తోంది.
అయితే కశ్మీర్ లో థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకుల్లో మాత్రం ఆ భయాలు అలాగే కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు ఎక్కడ థియేటర్లలో కాల్పులు జరుపుతారో అన్న భయంతో ప్రేక్షకులు సినిమా హాళ్ల వంక కూడా చూడటం లేదు. గత ఏడాది అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా కశ్మీర్‌లో విడుదల కాగా అక్కడి ప్రజలు అంతగా స్పందించలేదు.
అయితే తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా కశ్మీర్‌లోని పలు థియేటర్లలో విడుదలైంది. ఆశ్చర్యకరంగా ఈ సినిమాను చూసేందుకు అక్కడి ప్రజలు ఎగబడుతున్నారు. థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు కూడా పెడుతున్నాయి. అయితే కశ్మీర్‌లో ఇలా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని చెబుతున్నారు.
1980లో కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగా ఉన్న సమయంలో ప్రేక్షకులు థియేటర్లకు బాగానే వచ్చేవారు. ఆ తర్వాత కాలంలో ఉగ్రదాడులు, ఎన్ కౌంటర్లు పెరిగిన తర్వాత ప్రజలు ఆంక్షలు మధ్య బతుకుతున్నారు. మళ్లీ 32 ఏళ్ల తర్వాత కశ్మీర్ లోని థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మొత్తానికి పఠాన్ సినిమా బాలీవుడ్ కు పెద్ద హిట్ లోటును తీర్చడమే కాకుండా కశ్మీర్ ప్రజలను కూడా థియేటర్ల వరకు రప్పించడం విశేషం.