మంత్రిగారి ఇంట్లో పార్టీ.. ఫ్రీ సరుకు కోసం వైన్ షాపులపై ఒత్తిడి
వైన్ బాటిల్స్ ఫ్రీ గా కావాలని అడగడంతోపాటు, షాపు కూడా మూసేయించడంతో షాపు యజమాని షాకయ్యాడు. వెంటనే ఎక్సైజ్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశాడు. కానీ పనికాలేదు. ఇన్‌స్పెక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మంత్రుల చిలక్కొట్టుడు ఎలా ఉంటుందో చెప్పే సంఘటన ఇది. హర్యానాలోని ఓ మంత్రిగారి ఇంట్లో పార్టీ ఉంది. ఆ పార్టీలో మందు తప్పనిసరి. అయితే మందు కొని పార్టీ ఇస్తే ఆయన మంత్రి ఎందుకవుతారు. వెంటనే తన నియోజకవర్గంలోని ఎక్సైజ్ పోలీసులకు కబురు పెట్టారు. స్వామిభక్తిలో రాటుదేలిపోయిన ఆ పోలీసులు సారు కంటితో చెప్తే వారు చేతితో ఆచరించారు. 15 ఏళ్ల పాత గ్లెన్ ఫిడ్డిచ్ స్కాచ్ విస్కీ ఫుల్ బాటిళ్లు కావాలంటూ.. వైన్ షాపులకు ఫోన్ చేశారు ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ సందీప్ లోహన్. ఆ సరుకు తమ దగ్గర లేదని కొంతమంది చెప్పారు. దీంతో నేరుగా సందీప్ రంగంలోకి దిగారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 47 వద్ద ఉన్న మద్యం షాపుకి వెళ్లి రచ్చ చేశాడు. బాటిళ్లు ఇవ్వనందుకు వైన్ షాపు మూసివేయించాడు.
వైన్ బాటిల్స్ ఫ్రీ గా కావాలని అడగడంతోపాటు, షాపు కూడా మూసేయించడంతో షాపు యజమాని షాకయ్యాడు. వెంటనే ఎక్సైజ్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశాడు. కానీ పనికాలేదు. ఇన్‌స్పెక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అతను నేరుగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హోం మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇక చేసేదేం లేక మంత్రి కూడా సైలెంట్ అయ్యారు. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకుని ఆ వ్యవహారాన్ని ముగించారు.
మంత్రిని సేవ్ చేశారు..
చివరకు స్కాచ్ బాటిల్స్ అడిగిన మంత్రిని అందరూ సేవ్ చేశారు. అనామక ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ పై బదిలీ వేటు వేశారు. పంచకులలోని హెడ్ క్వార్టర్స్‌కి అతడిని బదిలీ చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కమిషనర్ తెలిపారు. ఇక్కడ మంత్రి చేసిన తప్పుకి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బదిలీ కావడం విశేషం. పార్టీ ఇవ్వాలనుకోవడం తప్పు కాదు, కానీ మంత్రి స్థాయి వ్యక్తి పార్టీ కోసం వైన్ షాపుల దగ్గర చీప్‌గా బాటిల్స్ డిమాండ్ చేయడం, ఇవ్వకపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎక్సైజ్ సిబ్బందిని పురమాయించడమే టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది.