పార్లమెంటు: చైనా చొరబాట్లపై చర్చకు ప్రభుత్వం నో....నేడు విపక్షాల సమావేశం
చైనా అంశం పై పార్లమెంటులో ప్రభుత్వం చర్చకు సిద్ద కాకపోవడంపై విపక్షాలు మండి పడుతున్నాయి. ఈ అంశంపై తమ వ్యూహాన్ని చర్చించడానికి విపక్ష ఫ్లోర్ లీడర్లు ఈ రోజు సమావేశం కానున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా చొరబాటు అంశాన్ని పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ అంశంపై ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లు గురువారం సమావేశమై తదుపరి వ్యూహంపై చర్చించాలని నిర్ణయించారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీల వాయిదా నోటీసును సభాపతి తిరస్కరించారు.
మరోవైపు కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ గురువారం మరోసారి వాయిదా నోటీసు ఇచ్చారు.
"అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా సరిహద్దు వద్ద ఉత్పన్నమైన పరిస్థితిపై వివరంగా చర్చించడానికి ఈ సభ జీరో అవర్, ఇతర కార్యక్రమాలను నిలిపివేస్తుంది. తూర్పు లడఖ్‌లోని రించెన్‌లాలో ఆగస్టు 2020 తర్వాత రెండు సైన్యాల మధ్య జరిగిన మొదటి భౌతిక ఘర్షణ ఇది" అని నోటీసులో పేర్కొన్నారు.