పరేశ్ రావల్‌కు స‌మ‌న్లు జారీ చేసిన కోల్‌కతా పోలీసులు

పరేశ్ రావల్ చేసిన వ్యాఖ్యల పట్ల బెంగాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అందులోకి తమను లాగడం ఏంటని ప్రజలు మండిపడ్డారు.

Advertisement
Update:2022-12-07 16:37 IST

బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నాయకుడు పరేశ్ రావల్ కు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. బెంగాలీల పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదు మేరకు వారు ఈ చర్యలు చేపట్టారు. పరేశ్ రావల్ కొంతకాలం కిందట బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల గుజరాత్ లో పరేశ్ రావల్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వల్సార్ లో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ 'గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ ఎక్కువగా ఉంది. రేపు తగ్గుతుంది. ఇప్పుడు ఉద్యోగాలు లేకపోయినా ముందు ముందు వస్తాయి. కానీ, మీ చుట్టూ రోహింగ్యాలో, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారో ఉంటే మీ పరిస్థితి ఏమిటి..? ఢిల్లీలో ఉన్న విధంగా వారంతా మీ చుట్టూ ఉంటే గ్యాస్ సిలిండర్లు అందుబాటు ధరలో ఉంటే మాత్రం ఏం చేస్తారు.. బెంగాలీలకు చేపల కూర వండి పెడతారా?' అని పరేశ్ రావల్ సభలో ప్రజలను ప్రశ్నించారు.

కాగా, పరేశ్ రావల్ చేసిన వ్యాఖ్యల పట్ల బెంగాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అందులోకి తమను లాగడం ఏంటని ప్రజలు మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా కూడా పరేశ్ రావల్‌పై ట్రోలింగ్ జరిగింది. బెంగాల్ ప్రజలు చేపలు తినడం నిషిద్ధమా.. అంటూ నెటిజన్లు విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో పరేశ్ రావల్ స్పందించారు. బెంగాలీ ప్రజలకు ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు.

చేపలను గుజరాతీలు కూడా తింటారని.. బెంగాలీలు అంటే తన ఉద్దేశం రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు అని అర్థం ఆయన వివరించారు. అయినా తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. కాగా పరేశ్ రావల్ పై బెంగాల్లో నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సీపీఐ నాయకుడు సలీం స్పందించారు. పరేశ్ రావల్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పరేశ్ రావల్ కు సమన్లు జారీ చేశారు. వచ్చే నెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News