Pakistan vs India : చర్చలకు సిద్ధమే కానీ..!

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌పై అక్కసు వెళ్లగక్కే పాకిస్తాన్ కాస్త చల్లబడినట్టుంది. రాజకీయ అస్థిరత, ఆధిపత్య పోరు, పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, వరదల వంటి ప్రకృతి విపరీత్యాలతో కలిగిన ఆస్తి, ప్రాణ నష్టాలు పాక్ బుద్ధి మార్చినట్టున్నాయి.

Advertisement
Update:2023-08-04 10:25 IST

తీవ్రమైన సమస్యలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. పాకిస్తాన్‌ సహా అన్ని దేశాలతోనూ తాము సత్సంబంధాలు, స్నేహపూర్వక వాతావరణాన్నే కోరుకుంటామని భారత విదేశాంగ ప్రతినిధి అరిందం బాగ్చి అన్నారు. కానీ అందుకు స‌హృద్భావ వాతావ‌ర‌ణం, ఉగ్రవాద రహిత పరిస్థితులు, త‌ప్పక ఉండాలని స్పష్టం చేశారు. నిజానికి పాకిస్తాన్‌తో భారత్ ఎప్పటినుంచో స్నేహపూర్వక సంబంధాల్ని కోరుకుంటూనే ఉందని మరోసారి గుర్తు చేశారు. అలాంటి సంబంధం ఏర్పడాలని వారు కోరుకుంటే ఉగ్రవాదం, శతృత్వం లేని శాంతియుత వాతావరణాన్ని సృష్టించే బాధ్యత కూడా పాక్‌పై ఉందని వెల్లడించింది. భారత్ అన్ని దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటుందన్న విషయంలో ఎలాంటి సందేహమే లేదని అరిందం బాగ్చి తేల్చి చెప్పారు.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌పై అక్కసు వెళ్లగక్కే పాకిస్తాన్ కాస్త చల్లబడినట్టుంది. రాజకీయ అస్థిరత, ఆధిపత్య పోరు, పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, వరదల వంటి ప్రకృతి విపరీత్యాలతో కలిగిన ఆస్తి, ప్రాణ నష్టాలు పాక్ బుద్ధి మార్చినట్టున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌తో శత్రుత్వం వద్దని భావిస్తోంది. అందుకే భారత్‌-పాక్‌ సంబంధాలపై పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని తీవ్రమైన సమస్యలపై భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పేదరికం, నిరుద్యోగం పై పోరాడుతున్న రెండు దేశాలకు యుద్ధం వాంఛనీయం కాదని పేర్కొన్నారు. యుద్ధాల వల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, విద్య, ఆరోగ్యం, ప్రజాసంక్షేమం వంటి ముఖ్యమైన రంగాలకు ఆర్థిక వనరుల కొరత ఏర్పడిందని నీతి వాక్యాలు చెప్పారు.

మరోవైపు భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఆందోళన కలిగించే అంశాలపై భారత్‌-పాకిస్తాన్‌ల చర్చలకు తాము మద్దతు ఇస్తామని, ఇదే విషయాన్ని తాము చాలాకాలంగా చెబుతూనే ఉన్నామని వైట్‌హౌస్‌ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించిన తర్వాత అమెరికా దీనిపై స్పందించింది.

కేంద్రం 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి దాన్ని జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం.. ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిని బహిష్కరించింది, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేసింది. అయితే పాక్‌ సీమాంత‌ర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ ద్వైపాక్షిక సంబంధాలు కష్టమే.

Tags:    
Advertisement

Similar News