అవయవదాతలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
2022లో తమిళనాడులో మొత్తం 156 బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరించారు. ఇందులో 51 ప్రభుత్వ ఆస్పత్రుల నుంచే ఉండటం గమనార్హం.
అన్ని దానాల్లోకెల్లా గొప్పది అవయవదానం అని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. అవయవదానంలో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ ఘనత రాష్ట్రానికి సాధించిపెట్టిన అవయవదాతలకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం జోహార్లు అర్పిస్తోందన్నారు. అదే సమయంలో ఆయా కుటుంబాలకు మరింత గౌరవం ఇచ్చేందుకు అవయవదాతల అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇకపై తమిళనాడులో అవయవదాతల అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతాయని చెప్పారు స్టాలిన్.
అవయవదానంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. బతికుండగానే స్వచ్ఛందంగా తమ అవయవాలను దానం చేస్తున్నట్టు కొంతమంది ప్రమాణ పత్రాలపై సంతకం చేస్తున్నారు. మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక అనుకోని కారణాలతో మరణం సంభవిస్తే, వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో అవయవదానానికి ఆస్పత్రులు ఏర్పాట్లు చేస్తుంటాయి. ఈ సందర్భంలో కూడా కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకొస్తున్నారు. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా అవయవాలను దానం చేస్తున్నారు. అలా అవయవాలు దానం చేసిన తర్వాత ఆ మృతదేహాలకు తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని ప్రకటించింది. 2022లో తమిళనాడులో మొత్తం 156 బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరించారు. ఇందులో 51 ప్రభుత్వ ఆస్పత్రుల నుంచే ఉండటం గమనార్హం. ఆర్గాన్ డొనేషన్ పై మరింత విస్తృత చర్చ జరిగేందుకు, వారికి మరింత గౌరవం ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు దెబ్బతగిలి మెదడు పనితీరు పూర్తిగా ఆగిపోయినా, శరీరం కొద్దిసేపు జీవంతోనే ఉంటుంది. ఆ సమయంలో గుండె స్పందనలు, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. అయితే రోగి ఎట్టిపరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఆ పరిస్థితినే బ్రెయిన్ డెడ్ కండిషన్‌గా పేర్కొంటారు. చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్ డెడ్ గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండెను నాలుగైదు గంటలు, కాలేయం 8-10 గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది.