బీజేపీకి గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం సిద్ధ‌మ‌వుతోందా?

2024 ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌ట్టి బుద్ధి చెప్పేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా ముందుకెళ్లేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అఖిలేష్ యాద‌వ్ తాజా మాట‌ల‌ను బ‌ట్టి ఈ విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతోంది.

Advertisement
Update:2022-12-13 12:46 IST

రానున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌నతా పార్టీకి గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం ఏర్పాటు చేసే దిశ‌గా ఆయా పార్టీలు గ‌ట్టిగానే క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఉత్త‌రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు దీనికి బ‌లాన్నిస్తున్నాయి.

అఖిలేష్ సోమ‌వారం త‌న స‌తీమ‌ణి డింపుల్ యాద‌వ్ ప్ర‌మాణ స్వీకారంలో పాల్గొన్నారు. డింపుల్ ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మొయిన్‌పురి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి లోక్‌స‌భకు ఎన్నికైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల‌తో మాట్లాడిన అఖిలేష్‌.. రానున్న సాధార‌ణ ఎన్నిక‌ల కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌.. కేంద్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం ఏర్పాటు దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని చెప్పారు. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం గ‌రిష్ట స్థాయికి చేరింద‌ని, నిరుద్యోగం పెరుగుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అంబేడ్క‌ర్ భార‌త ప్ర‌జ‌ల‌కు అందించిన హ‌క్కుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కాల‌రాస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. సాధార‌ణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ నేప‌థ్యంలో ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్‌ఎస్‌) ఏర్పాటు సంద‌ర్భంగా కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా జ‌రిపే పోరులో క‌లిసి రావాల‌ని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా.. ఆయ‌న అఖిలేష్ యాద‌వ్‌ను, బీహార్ సీఎం నితీష్ కుమార్‌, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని కూడా సీఎం కేసీఆర్ క‌లిశారు. ఈ నేప‌థ్యంలో 2024 ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌ట్టి బుద్ధి చెప్పేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా ముందుకెళ్లేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అఖిలేష్ యాద‌వ్ తాజా మాట‌ల‌ను బ‌ట్టి ఈ విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతోంది.

ఒక ప‌క్క ఆమ్ ఆద్మీ పార్టీ ఒంట‌రిగా బ‌లం పెంచుకుని దేశ‌మంత‌టా విస్త‌రించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుండ‌గా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిర్వ‌హిస్తున్న భార‌త్ జోడో యాత్ర ద్వారా మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలు నింపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోప‌క్క కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో దూకుడుగా ముందుకెళుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు అన్నీ క‌లిసి బీజేపీకి ఝ‌ల‌క్ ఇచ్చేందుకు ఒక్క‌టిగా ముందుకు సాగుతాయా.. లేక ఎవరికి వారే త‌మ సొంత బ‌లం పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాయా అనేది వేచి చూడాలి. విడిగా పోటీ చేస్తే మాత్రం ఇటీవ‌ల జ‌రిగిన గుజ‌రాత్ ఎన్నిక‌ల‌ త‌ర‌హాలోనే ఓట్లు చీలిపోయి బీజేపీ లాభ‌ప‌డే అవ‌కాశ‌ముంటుంది. ఈ నేప‌థ్యంలో ముందుముందు ఆయా పార్టీలు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాయ‌నేది వేచిచూడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News