రిమోట్ ఓటింగ్ ని వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఎందుకంటే..?

దీనివల్ల ఓటింగ్ శాతం పెరగొచ్చేమో కానీ, అక్రమాలకు కూడా అవకాశం ఉందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల సంఘం ప్రతిపాదనలోనే స్పష్టత లేదంటున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.

Advertisement
Update:2023-01-16 07:11 IST

భారత్ లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల కమిషన్ ప్రయోగాత్మకంగా తీసుకు రావాలనుకుంటున్న రిమోట్ ఈవీఎం విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. దీనిపై త్వరలో ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలకు ఓ డెమో ఇవ్వాలనుకుంది. అయితే అంతకు ముందే కాంగ్రెస్ సారథ్యంలో విపక్ష పార్టీలన్నీ ఈ రిమోట్ ఓటింగ్ ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయి. ఎన్నికల సంఘం ప్రతిపాదనలోనే స్పష్టత లేదంటున్నారు కాంగ్రెస్ నేత ద్విగిజయ్ సింగ్. ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.

రిమోట్ ఓటింగ్ అంటే..

ఉపాధికోసం, పనులకోసం వేరే ప్రాంతాలకు వెళ్లినవారు ఓటరు గుర్తింపుని మాత్రం సొంత ఊరినుంచి బదిలి చేసుకోరు. సొంత ఊరిలో ఓటు ఉంటే స్థానిక గుర్తింపుగా వారు భావిస్తారు. అదే సమయంలో పోలింగ్ వేళ వారికి సొంత ఊరికి వచ్చే అవకాశం కొన్నిసార్లు ఉండకపోవచ్చు.


దీనివల్ల భారత్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందనే అభిప్రాయం ఉంది. ఓటు హక్కు ఉంటుంది కానీ చాలామంది పోలింగ్ రోజు ఆయా ప్రాంతాల్లో ఉండకపోవడం వల్ల దాన్ని వినియోగించుకోలేరు. ఇలాంటివారికోసం సుదూర ప్రాంతాల్లో ఉన్నా, వారి సొంత నియోజకవర్గంలో జరిగే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఇస్తోంది రిమోట్ ఈవీఎం. ఇటీవలే రిమోట్ ఈవీఎంల ప్రతిపాదన చేసిన ఎన్నికల కమిషన్, దీనిపై రాజకీయ పార్టీలకు డెమో ఇచ్చేందుకు సిద్ధపడింది.

అయితే ఈ ప్రతిపాదన ఓటింగ్ శాతం పెరగొచ్చేమో కానీ, అక్రమాలకు కూడా అవకాశం ఉందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను తెచ్చినా, సొంత ఊరిలో అయితే ఓటర్లను సులభంగా గుర్తించొచ్చు, అందుకే ఏజెంట్లను నియమించుకుంటాయి రాజకీయ పార్టీలు. కానీ రిమోట్ ఓటింగ్ లో అలాంటి సౌకర్యం ఉండదు. అంటే రిగ్గింగ్ కి అవకాశం ఎక్కువ.

అధికార పార్టీ తలచుకుంటే రిమోట్ ఓటింగ్ ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకునే అకాశముంది. అందుకే దీనిపై కాంగ్రెస్ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈసీ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ సార‌ధ్యంలో యునైటెడ్ జ‌న‌తాద‌ళ్, సీపీఐ, సీపీఎం, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత‌లు చర్చించారు. ఆర్వీఎం ప్ర‌తిపాద‌న రాజ‌కీయంగా ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. ఈసీ ప్ర‌తిపాద‌న‌పై ఉమ్మ‌డి వైఖ‌రితో ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించారు.

Tags:    
Advertisement

Similar News