బీజేపీని ఓడిస్తాం.. కానీ కాంగ్రెస్ తో కలవలేం

ఎన్సీపీ, డీఎంకే వంటి పార్టీలు కూడా కాంగ్రెస్ బలపడాలనుకుంటున్నాయి కానీ, తమకంటే బలంగా మారడం మాత్రం వారికి ఇష్టంలేదు.

Advertisement
Update:2023-06-20 14:46 IST

దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీని గద్దె దించాలంటే ఆ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకుండా చేయడమొక్కటే మార్గం కాదు. ఎవరు సపోర్ట్ ఇచ్చినా బీజేపీ నిలబడలేనంతగా దెబ్బకొట్టాలి. అలా కొట్టాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలి. కానీ ఇక్కడ అది సాధ్యమయ్యేలా లేదు. ప్రతిపక్షాలన్నీ ఆయా రాష్ట్రాల్లో తామే బలంగా ఉండాలని కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ కి చోటివ్వడానికి ఇష్టపడటంలేదు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్‌ లో కాంగ్రెస్ పోటీ చేయకుండా ఉంటే, తాము రాజస్థాన్ జోలికి రాము అంటున్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. యూపీలో కాంగ్రెస్ అడుగుపెట్టకపోతే ఆ పార్టీకి కేంద్రంలో మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామంటున్నారు అఖిలేష్ యాదవ్. కాంగ్రెస్ కి మద్దతిస్తాం కానీ, పశ్చిమబెంగాల్ లో మాదే రాజ్యమంటున్నారు మమతా బెనర్జీ. ఒకరకంగా ఈ కుమ్ములాటే బీజేపీకి మానసిక స్థైర్యాన్నిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అంతిమంగా తాము బలపడాలని భావిస్తోంది కమలదళం.

కేంద్రంలోని బీజేపీని దెబ్బకొట్టడానికి ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండటంతోపాటు ఒక ప్రధాన పార్టీ వాటికి అనుసంధానంగా ఉండాలి. ఆ బాధ్యత తాను తీసుకుంటానంటోంది కాంగ్రెస్. కానీ ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ, టీఎంసీ వంటి పార్టీలు కాంగ్రెస్ కి పెత్తనం అప్పగించడానికి ఇష్టపడటం లేదు. ఎన్సీపీ, డీఎంకే వంటి పార్టీలు కూడా కాంగ్రెస్ బలపడాలనుకుంటున్నాయి కానీ, తమకంటే బలంగా మారడం మాత్రం వారికి ఇష్టంలేదు.

తమకు సాగిలపడకపోతే కేసులు పెట్టి లొంగదీసుకోవడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం బీజేపీకి పరిపాటిగా మారింది. బాధితులంతా ఇప్పుడు ఏకతాటిపైకి వస్తున్నారు. కేంద్రం దుర్మార్గాలను ఎండగడుతున్నారు. కానీ విడివిడిగా పోరాటాలకు సిద్ధమయితే లాభం లేదు. ఇగోలు పక్కనపెట్టి కలసి పోరాడితేనే బీజేపీకి గుణపాఠం చెప్పగలరు. కానీ ప్రతిపక్షాలు.. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ పార్టీలు కాంగ్రెస్ తో చేతులు కలపడానికి ఇష్టపడటం లేదు. బీజేపీని మట్టికరిపించడానికి సై అంటున్నారు కానీ, తమ పుట్టలో కాంగ్రెస్ వేలు పెట్టకూడదనేది వారి కండిషన్. అలాంటి కండిషన్లకు కాంగ్రెస్ ఒప్పుకునే పరిస్థితి కనిపించడంలేదు. 

Tags:    
Advertisement

Similar News