రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రతిపక్ష నేతల భేటీ

మణిపూర్ సమస్యను రాష్ట్రపతికి వివరించామని చెప్పారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. మణిపూర్‌ లో మహిళలపై దురాగతాలు ఆగలేదని, పునరావాస కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని.. ఈ విషయాలన్నిటినీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

Advertisement
Update:2023-08-02 15:51 IST

మణిపూర్ సమస్య పరిష్కారం విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కోరారు ప్రతిపక్ష పార్టీల కూటమి (INDIA) నేతలు. ఆ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. జూలై 29, 30 తేదీల్లో మణిపూర్ లో INDIA నేతలు పర్యటించారు. అక్కడి పరిస్థితులను వారు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం ఓ నివేదికను రాష్ట్రపతికి సమర్పించారు. ఇప్పటికే ఆలస్యమైందని, కేంద్రం చేష్టలుడిగి చూస్తోందని.. మణిపూర్ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు నేతలు.

మణిపూర్ సమస్యను రాష్ట్రపతికి వివరించామని చెప్పారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. మణిపూర్‌ లో మహిళలపై దురాగతాలు ఆగలేదని, పునరావాస కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని.. ఈ విషయాలన్నిటినీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌ లో పర్యటించి, శాంతిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని అన్నారు ఖర్గే.


మణిపూర్‌ లో మే 3 నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోగా, 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వీరి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినా.. అందులో సౌకర్యాల లేమి వెక్కిరిస్తోంది. చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంపై పార్లమెంట్ లో ప్రధాని వివరణకు ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ఫలితం లేదు. ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఇటీవల ఘాటుగా స్పందించింది. పోలీస్ వ్యవస్థ తీరుని తీవ్రంగా తప్పుబట్టింది. పోలీస్ విచారణ అవసరం లేదని స్వతంత్ర సంస్థ దర్యాప్తు అవసరమని తేల్చి చెప్పింది. ఈ దశలో మణిపూర్ విషయంలో జోక్యం కోరుతూ నేడు INDIA బృందం రాష్ట్రపతిని కలవడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News