బ్లాక్ మెయిల్ పాలిటిక్స్..!
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేసిన పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా విస్తృత మద్దతు లభించింది. ట్విట్టర్ వేదికగా కోట్లాది మంది రైతులకు సంఘీభావాన్ని ప్రకటించారు.
బ్లాక్ మెయిల్ పాలిటిక్స్. కేంద్రం మీద బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శ ఇది. రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని కొంతకాలంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నేతల మీదికి ఉసిగొలుపుతోందని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడీ ఆరోపణలు ప్రతిపక్షాలే కాదు స్వతంత్ర సంస్థలు కూడా చేస్తున్నాయి. మొన్న బీబీసీ చేసిన ఇలాంటి ఆరోపణనే ఇప్పుడు ట్విట్టర్ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేసిన పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా విస్తృత మద్దతు లభించింది. ట్విట్టర్ వేదికగా కోట్లాది మంది రైతులకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఆ సందర్భంగా రైతులకు సంఘీభావాన్ని ప్రకటించే అకౌంట్లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం కోరినట్లు ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే చెప్పారు.
ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు చేసిన పోస్టులను తొలగించాలని ఇండియన్ గవర్నమెంట్ కోరిందన్నారు. ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారతదేశం భిన్నాభిప్రాయానికి తావులేకుండా చేయాలనుకుందన్నారు. తమ అభ్యర్థనను అంగీకరించకపోతే, భారత్‌లో ట్విట్టర్‌ను మూసేస్తామని భారత ప్రభుత్వం బెదిరించినట్లు జాక్ డోర్సే చెప్పారు. ట్విట్టర్ ఉద్యోగుల ఇండ్లల్లో తనిఖీలు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. భారత ప్రభుత్వంపై డోర్సే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ట్విట్టర్ మాజీ సీఈఓ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. సాంకేతిక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డోర్సే అసత్యాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డోర్సే సీఈఓగా ఉన్న సమయంలో ట్విట్టర్ భారతదేశ చట్టాలను ఉల్లంఘించిందని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 2020-2022 మధ్య కాలంలో ట్విట్టర్ నిబంధనలను అతిక్రమించిందన్నారు. దేశ సార్వభౌమత్వానికి భంగంకలిగించేలా అప్పట్లో ట్విట్టర్ వ్యవహరించిందన్నారు. తరువాత కాలంలో తన తీరు మార్చుకుందన్నారు.
2020లో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. వాటికి వ్యతిరేకంగా ఏడాదిన్నర పాటు దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో లక్షలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేశారు. వందలాది మంది రైతులు ఈ ఉద్యమంలో మృతిచెందారు. దేశ దేశాలను ఎందరో ప్రజాస్వామిక వాదులు, హక్కుల కార్యకర్తలు ట్విట్టర్ వేదికగా రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఇలాంటి అకౌంట్‌లను తొలగించాలని కేంద్రం ట్విట్టర్‌ను ఆదేశించింది. లేదంటే భారత్‌లో ట్విట్టర్‌ను మూసివేస్తామంది.
2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ విషయంలోనూ కేంద్రం ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. బీబీసీ డాక్యుమెంటరీ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో డాక్యుమెంటరీ ప్రసారాన్ని దేశంలోని నిలిపివేసింది. ఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ చర్యను కక్షసాధింపుగా అభివర్ణించాయి ప్రతిపక్షాలు. కేంద్రం భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి ఏజెన్సీలను వాడుకుంటోందని, ఇది పూర్తిగా బెదిరింపు రాజకీయమే అని వాదించాయి. డోర్సే తాజా స్టేట్‌మెంట్ మరోసారి కేంద్రం తీరుపై విమర్శలకు కారణమైంది.