అవిశ్వాసం మోడీని దించ‌డానికి కాదు.. మోడీని ఎండ‌గ‌ట్ట‌డానికి..

ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్‌లో జరుగుతున్న హింసపై చర్చించేలా...కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్‌, BRS అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి.

Advertisement
Update:2023-07-26 18:19 IST

విపక్షాల కూటమి ఇండియా ఏర్పడి పది రోజులు కాక ముందే మోడీ సర్కార్‌పై పెద్ద యుద్ధాన్ని ప్రకటించింది. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చతో పాటు ఓటింగ్‌కు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించారు. అన్ని పార్టీలతో చర్చించాక ఓటింగ్ తేదీని ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో అసలు అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి..! ఎందుకు ప్రవేశ పెడతారు..! అవిశ్వాస తీర్మానాన్ని ఏయే పార్టీలు ఇచ్చాయి. ఎందుకిచ్చాయి. స్పీకర్ బాధ్యత ఏంటి. సభలో ఎవరి బలమెంత అనే విషయాలపై ఓ లుక్కెద్దాం.

అసలు అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి..?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెడతాయి. కనీసం 50 మంది సభ్యుల సంతకాలతో ఈ తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు అందజేయాల్సి ఉంటుంది. అయితే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కారణం చూపించాల్సిన అవసరం లేదు. దీని గురించి రాజ్యాంగంలోనూ ఎక్కడా పేర్కొనలేదు. కానీ, లోక్‌సభ నియామవళి రూల్‌ నం.198లో దీని ప్రస్తావన ఉంది. రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ అండ్‌ కండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్‌ పార్లమెంట్‌- 1950 చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు.

ఏయే పార్టీలు నోటీసులు ఇచ్చాయి..?

ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్‌లో జరుగుతున్న హింసపై చర్చించేలా...కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్‌, BRS అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగొయ్​, BRS పార్టీ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు విడివిడిగా స్పీకర్​ కార్యాలయానికి తీర్మాన నోటీసులు ఇచ్చారు.

అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌ ఏం చేస్తారు..?

విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను అనుమతించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా..అన్ని పార్టీలతో చర్చించి చర్చకు అనువుగా తేదీని ప్రకటించనున్నారు. తీర్మానాన్ని ఆమోదించిన రోజు నుంచి 10 రోజుల్లోపు చర్చ జరిగే తేదీని నిర్ణయించాలి. అధికార, విపక్ష పార్టీల బలాబలాల ఆధారంగా చర్చకు స్పీకర్​ సమయం కేటాయిస్తారు. ముందుగా అధికార పార్టీ ఎంపీలు మాట్లాడాక.. విపక్ష ఎంపీలు మాట్లాడుతారు.

ప్రస్తుతం సభలో బలాబలాలు..?

స్పీకర్​ నిర్ణయించిన రోజున లోక్‌సభలో చర్చ జరుగుతుంది. తర్వాత ఓటింగ్‌ నిర్వహిస్తారు. అందులో అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. లోక్‌సభలో మొత్తం 537 స్థానాలుండగా..అధికార NDA కూటమికి 320 మందికిపైగా సభ్యులున్నారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలకు కలిపి 141 మంది సభ్యుల బలం ఉంది. ఇండియా కూటమికి మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ.. తీర్మానం వీగిపోవడం ఖాయమే. అయితే తీర్మానం వీగిపోతుందని తెలిసినప్పటికీ... కేవలం మణిపూర్‌ అంశంపై చర్చించేందుకే ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

విపక్షాల మైనస్‌ ఏంటి..?

అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌ ఒకే చెప్పినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఎండగట్టే ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ ప్రతిపక్షంలో లేకపోవడం మైనస్‌గా మారింది. కాంగ్రెస్‌కు చెందిన మల్లిఖార్జున ఖర్గే, చిదంబరం లాంటి నేతలు రాజ్యసభలో ఉన్నారు. అనర్హత వేటు కారణంగా రాహుల్ గాంధీ లోక్‌సభకు దూరమయ్యారు. ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్షాలకు హిందీలో అనర్గళంగా మాట్లాడే నేతలు లేరు. RJDకి లోక్‌సభలో ప్రాతినిథ్యం లేదు. ఇక హిందీలో బాగా మాట్లాడే ఎస్పీ లీడర్ అఖిలేష్ యాదవ్, ఆప్‌కు చెందిన భగవంత్‌ మాన్‌.. ఇద్దరూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు వెళ్లేందుకు ఎంపీ స్థానాలకు రిజైన్ చేశారు.

ఇప్పటివరకూ ఎన్ని సార్లు..?

అవిశ్వాస తీర్మానాన్ని మొదటిసారిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వంపై 1963లో జేబీ కృపలానీ ప్రవేశపెట్టారు. 62 మంది సభ్యులు తీర్మానాన్ని సమర్థించగా, 347 మంది సభ్యులు వ్యతిరేకించారు. దీంతో నెహ్రూ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇందిరాగాంధీ ప్రభుత్వంపై 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పటికీ అన్నీ వీగిపోయాయి. ఇక ఒకే పదవీకాలంలో అంటే 5 సంవత్సరాల వ్యవధిలో పీవీ నరసింహరావు ప్రభుత్వంపై అత్యధికంగా 8 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పటికీ అన్ని ఫెయిల్ అయ్యాయి. 1999లో అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఒకే ఒక్క ఓటు తేడాతో నెగ్గడంతో వాజ్‌పేయ్‌ ప్రభుత్వం కూలిపోయింది. ఇక చివరిసారి 2018లో మోడీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అప్పుడు ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.

Tags:    
Advertisement

Similar News