హిమాచల్ లో 'ఆపరేషన్ లోటస్' ప్రారంభం... ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నంలో కాంగ్రెస్

బీజేపీ 'ఆపరేషన్ లోటస్' నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే బాధ్యతను చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాలు తీసుకున్నట్టు సమాచారం. తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్ తరలించాలని నిర్ణయించుకున్నారు.

Advertisement
Update:2022-12-08 11:02 IST

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో దారుణంగా వెనకపడ్డ కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం లీడ్ లో ఉంది. మొత్తం 68 అసెంబ్లీ సీట్లలో 33 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా 31 సీట్లలో బీజేపీ 4 సీట్లలో ఇండిపెండెంట్ లు లీడ్ లో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా కూడా తెరిచే అవకాశం కనిపించడం లేదు.

బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఫలితాలు సాధిస్తుండటంతో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేయడం అప్పుడే ప్రారంభించిందన్న సమాచారం రావడంతో కాంగ్రెస్ అగ్రనేతలు ఉలిక్కిపడ్డారు.

బీజేపీ 'ఆపరేషన్ లోటస్' నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే బాధ్యతను చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాలు తీసుకున్నట్టు సమాచారం. తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్ తరలించాలని నిర్ణయించుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగతంగా దీనిని పర్యవేక్షిస్తున్నారని, ఈ రోజు ఆమె సిమ్లా చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద వల విసురుతూనే ఇండిపెండెంట్లను కూడా టార్గెట్ చేసింది. ఒక వేళ‌ కాంగ్రెస్ కు అవసరమైన 35 సీట్లు రాకపోతే ఇండిపెండెంట్లను తమవైపు లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఒక సారి ప్రభుత్వం ఏర్పడితే ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమవైపు రావడం సులభమవుతోందని బీజేపీ భావిస్తోంది.

కాగా ఈ ఉదయం 11 గంటల‌ వరకు వచ్చిన ఫలితాల వివరాలు: కాంగ్రెస్ 38 స్థానాల్లో లీడ్ లో ఉండగా, బీజేపీ 27 స్థానాల్లో లీడ్ లో ఉందని టైమ్స్ నౌ ప్రకటించగా, కాంగ్రెస్ 37 లీడ్, బీజేపీ 28 లీడ్ లో ఉందని ఇండియా టుడే ప్రకటించింది. కాంగ్రెస్ 38 లీడ్ లో ఉండగా, బీజేపీ 27 లీడ్ లో ఉందని న్యూస్ 18 తెలిపింది.

Tags:    
Advertisement

Similar News