బైక్ పై లగేజీ తీసుకెళ్తే జరిమానా కట్టాల్సిందే.. ఢిల్లీలో గందరగోళం
స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ కూడా ఈ కొత్త నిబంధన వల్ల తిప్పలు పడుతున్నారు. బైక్ లపై మనుషులే వెళ్లాలని, ఇలా పార్శిళ్ల డెలివరీలకు వాటిని ఉపయోగించకూడదని పోలీసులు, ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారట.
కొన్ని దేశాల్లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్ కేవలం కార్లలోనే పార్శిళ్లు తీసుకెళ్లి కస్టమర్లకు అందిస్తుంటారు. భారత్ లో అది ఏమాత్రం గిట్టుబాటు కాదనే విషయం అందరికీ తెలుసు. అందుకే బైక్ లపై స్విగ్గీ, జొమాటో బాయ్స్ రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో వారికి చిక్కొచ్చిపడింది. ఫుడ్ డెలివరీ బ్యాగుల్ని భుజానికి తగిలించుకుని బైక్ పై వెళ్తున్న వారిని పోలీసులు ఆపేస్తున్నారు. బైక్ లను బైక్ ట్యాక్సీలుగా ఎందుకు వాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మోటారు వాహనాల చట్టాన్ని అతిక్రమించారంటూ ఇటీవల స్విగ్గీ డెలివరీ బాయ్ కి 15వేల రూపాయల ఫైన్ కూడా విధించారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపింది.
ఎందుకీ సమస్య..?
బైక్ లను బైక్ ల మాదిరిగానే వినియోగించాలని, బైక్ ట్యాక్సీల పేరుతో ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చడం రవాణా చట్టాలను అతిక్రమించడమేనంటూ ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. బైక్ ట్యాక్సీలును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఓలా, ఉబెర్ వంటి సంస్థలు బైక్ ట్యాక్సీలను పక్కనపెట్టాయి. సైడ్ ఇన్ కమ్ తో సరిపెట్టుకుంటున్న నిరుద్యోగులు, చిరుద్యోగులు కూడా దీనివల్ల బాగా ఇబ్బంది పడ్డారు. వారి సంగతి పక్కనపెడితే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో బాయ్స్ కూడా ఈ కొత్త నిబంధన వల్ల తిప్పలు పడుతున్నారు. బైక్ లపై మనుషులే వెళ్లాలని, ఇలా పార్శిళ్ల డెలివరీ లకు వాటిని ఉపయోగించకూడదని పోలీసులు, ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారట. వీరి వాహనాలను సైతం బైక్ ట్యాక్సీలుగా పేర్కొంటూ రవాణా శాఖ అధికారులు భారీగా చలాన్లు వేస్తున్నారట. దీంతో ఆయా ఫుడ్ డెలి వరీ కంపెనీలు ఢిల్లీ సర్కారుకు ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరాయి.
అందరిలో భయం భయం..
స్విగ్గీ, జొమాటో బాయ్స్ మాత్రమే కాదు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థల డెలివరీ బాయ్స్ కూడా బైక్ పై పెద్ద పెద్ద బ్యాగ్ లు పెట్టుకుని వెళ్లడానికి జంకుతున్నారట. ఢిల్లీలో ఎక్కడ, ఎవరు ఆపుతారో తెలియని పరిస్థితి. పొరపాటున చలానా రాశారంటే నెల జీతంలో సగం దానికే సరిపోతుంది. అందుకే డెలివరీకి వెళ్లడానికి వారు భయపడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కొంతమంది పోలీసులు, ఆర్టీఏ అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని, దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని జొమాటో, స్విగ్గీ సంస్థలు కోరుతున్నాయి.