కరోనాను మించిన ఉపద్రవం.. మళ్లీ ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం

కరోనా టైమ్ లో లాక్ డౌన్ విధించారు, ఇప్పుడు లాక్ డౌన్ లేకపోయినా జనం రోడ్లపైకి రాలేకపోతున్నారు. అప్పుడు విధిలేక ఆన్ లైన్ క్లాసులు పెట్టారు, ఇప్పుడు ఆ మహమ్మారి లేకపోయినా ఆన్ లైన్ పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement
Update:2022-11-04 10:17 IST

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 401 నుంచి 500 మధ్యలో ఉంటే దాన్ని తీవ్ర స్థాయిగా పరిగణిస్తారు. ప్రస్తుతం నొయిడాలో AQI 562కి పెరిగింది. అంటే అది తీవ్ర స్థాయిని కూడా దాటేసింది. అసలు నొయిడా ప్రాంతంలో ప్రజలు బయటకు రావడానికి కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోంది. వీధుల్లో ఏ వాహనం ఎటువైపు వస్తుందో తెలియదు, పట్టపగలే చిమ్మచీకట్లు అలముకున్నాయి. దీంతో వారం రోజులపాటు స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

ఢిల్లీ, నొయిడా ప్రాంతాల్లో శీతాకాలం వాయు కాలుష్య ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. గత రెండేళ్లుగా కరోనా వల్ల, జన సంచారం, ఇతర వ్యాపార కలాపాలు తగ్గి.. కాలుష్యం పరిమాణం బాగా తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ యథాస్థితికి చేరుకోవడంతో కాలుష్యం పాళ్లు పెరిగింది. దీంతో ఈ ఏడాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం స్కూళ్ల నిర్వహణలో ఆలోచిస్తుండగా.. నొయిడాలో మాత్రం ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టేశారు. 1నుంచి 8వ తరగతి వరకు ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసులకు అనుమతిచ్చారు. వీలైతే 9నుంచి 12వ తరగతి వరకు కూడా ఆన్ లైన్ క్లాసులు జరపాలని అధికారులు ఆదేశించారు.

ఢిల్లీలో మరింత పడిపోయిన గాలి నాణ్యత..

అటు ఢిల్లీలో ఈరోజు ఉదయం 6 గంటలకు వాయు నాణ్యత 453గా నమోదైంది. అంటే ఇది తీవ్రస్థాయిలో ఉన్నట్టు లెక్క. ఉదయాన్నే పొగమంచు దట్టంగా కమ్మేసింది. వాటర్ స్ర్పింక్లర్లు, యాంటీ స్మాగ్ గన్లు ఉపయోగించి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఎలక్ట్రిక్, సీఎన్జీతో నడిచే వాహనాలు మినహా మిగతా భారీ ట్రక్కులను ఢిల్లీలోకి రానివ్వడంలేదు. వాటి రాకపోకలపై నిషేధం విధించారు. ప్రభుత్వరంగంలో జరిగే నిర్మాణ పనుల్ని పూర్తిగా ఆపివేశారు. ప్రైవేటురంగంలో కూడా కూల్చివేతలను కొన్నిరోజులు ఆపాలని ఆదేశాలిచ్చారు. మొత్తమ్మీద ఇది కరోనాకంటే పెద్ద ఉపద్రవంగా మారిపోయింది. కరోనా టైమ్ లో లాక్ డౌన్ విధించారు, ఇప్పుడు లాక్ డౌన్ లేకపోయినా జనం రోడ్లపైకి రాలేకపోతున్నారు. అప్పుడు విధిలేక ఆన్ లైన్ క్లాసులు పెట్టారు, ఇప్పుడు ఆ మహమ్మారి లేకపోయినా ఆన్ లైన్ పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    
Advertisement

Similar News