పూరీ జగన్నాథుడు మోడీకి భక్తుడు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద కామెంట్స్
మహాప్రభు జగన్నాథుడు విశ్వేశ్వరుడని.. ఆయనను మరొక మానవుడికి భక్తుడిగా పిలవడం అంటే భగవంతుడిని అవమానించడమేనన్నారు.
బీజేపీ నేత, పూరీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సంబిత్ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూరీ జగన్నాథుడు, ప్రధాని మోడీని ఉద్దేశించి సంబిత్ పాత్ర చేసిన కామెంట్స్ వైరల్‌గా మారి వివాదానికి దారి తీశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన సంబిత్ పాత్ర.. పూరీ జగన్నాథుడు సైతం మోడీకి భక్తుడే అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు బీజూ జనతా దళ్‌కు అస్త్రంగా మారాయి.
సంబిత్ పాత్ర కామెంట్స్‌పై ఒడిశా సీఎం, బీజూ జనతా దళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. మహాప్రభు జగన్నాథుడు విశ్వేశ్వరుడని.. ఆయనను మరొక మానవుడికి భక్తుడిగా పిలవడం అంటే భగవంతుడిని అవమానించడమేనన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది ఒడిశా ప్రజల మనోభావాలను కించపరచడమేనన్నారు నవీన్ పట్నాయక్.
తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు సంబిత్ పాత్ర. మీడియాతో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యానని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. పూరీలో మోడీ రోడ్ షో సక్సెస్ కావడంతో చాలా మీడియా ఛానల్స్‌తో మాట్లాడానని.. చాలా చోట్ల మోడీ గొప్పవాడని చెప్పానన్నారు. కానీ, ఎక్కడో ఒక చోట పొరపాటున జగన్నాథుడు మోడీ భక్తుడని టంగ్ స్లిప్ అయ్యానంటూ వివరణ ఇచ్చుకున్నారు. దీన్ని వివాదంగా మార్చొద్దంటూ నవీన్ పట్నాయక్‌కు విజ్ఞప్తి చేశారు. తన తప్పును సరిదిద్దుకునేందుకు మూడు రోజులు ఉపవాసం ఉంటానని చెప్పుకొచ్చారు.