బిజెపి వ్యతిరేక పక్షాల ఐక్యతకు అడ్డంకులెన్నో!

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాల‌న్న‌ లక్ష్యంతో జూన్‌ 23న పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు నితీష్‌కుమార్‌. సమావేశానికి ముందుగానే వివిధ పార్టీలు తమ అభ్యంతరాలు, అసంతృప్తులు, భిన్నాభిప్రాయాలు మీడియా ముందు వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Update:2023-06-17 16:58 IST

బిజెపి వ్యతిరేక పక్షాల ఐక్యతకు అడ్డంకులెన్నో!

బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నిటినీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకులెన్నో ఏర్పడుతున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాల‌న్న‌ లక్ష్యంతో జూన్‌ 23న పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు నితీష్‌కుమార్‌. సమావేశానికి ముందుగానే వివిధ పార్టీలు తమ అభ్యంతరాలు, అసంతృప్తులు, భిన్నాభిప్రాయాలు మీడియా ముందు వ్యక్తం చేస్తున్నాయి. వీటిని గమనిస్తే బిజెపి వ్యతిరేక పక్షాల ఐక్యత అన్నది సుదూర స్వప్నంగా తోస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

పంజాబ్‌, ఢిల్లీలలో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయకపోతే తాము రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో పోటీ చేయబోమని, లేదంటే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ అభ్యర్థుల్ని పోటీకి నిలుపుతామని ఆమ్‌ ఆద్మీ పార్టీ చెబుతోంది. ఇక బిజెపిని ఓడించాలంటే ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 80 సీట్లలో బిజెపి నెగ్గకుండా చూడాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ అంటున్నారు. ఇందుకు అనువుగా ఇతర పక్షాలు కలిసి రావాలని కోరుతున్నారు. అంటే అత్యధిక సీట్లలో తమ పార్టీ పోటీ చేయడానికి ఇతర పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ అంగీకరించాలన్నదే ఆయన వాదం.

తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ మరో మెలికపెట్టారు. బెంగాల్‌లో సిపిఎంతో ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా ఉంటేనే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తామని, లేకపోతే ఆ పార్టీకి సహకరించేది లేదని తెగేసి చెప్పారు. బిఆర్‌ఎస్‌ పార్టీ బిజెపి తోకపార్టీలా వ్యవహరిస్తుందని ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌ అన్నారు. బిఆర్‌ఎస్‌ బిజెపి బి టీమ్‌ అంటూ మీడియా ముందే వ్యాఖ్యానించారాయన. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌ ప్రవేశం పట్ల అసంతృప్తిని ఆయన ఈ విధంగా వ్యక్తం చేశారు.

ఒకవైపున ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీష్‌కుమార్‌ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే మరోవైపున ఆ రాష్ట్ర మంత్రి సంతోష్‌ సుమన్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తమ పార్టీ హిందూస్తాన్‌ అవామ్‌ మోర్చాను జనతాదళ్‌లో విలీనం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నందుకు నిరసనగా రాజీనామా చేసినట్టు సంతోష్‌ సుమన్‌ చెప్పారు. తమ కూటమిలో ఉన్న పార్టీని బలవంతంగా కలుపుకోవాలనే నితీష్‌కుమార్‌ పార్టీ వైఖరి ఆ పార్టీ సచ్ఛీలతని ప్రశ్నార్థకం చేసింది. బలమైన జాతీయ పార్టీలు చిన్నపార్టీలని చిన్నచూపు చూసే ధోరణినే నితీష్‌కుమార్‌ పార్టీ అనుసరించడం విమర్శల్ని ఎదుర్కొంటున్నది.

ఈ విధంగా జూన్‌ 23 పాట్నాలో బిజెపి యేతర పక్షాల సమావేశానికి ముందుగానే లుకలుకలు ఎన్నో బయటపడుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తన ప్రయోజనానికే పెద్దపీట వేస్తున్నాయి. ముఖ్యంగా అనేక రాష్ట్రాలలో నిర్మాణాత్మ‌క వ్య‌వ‌స్థ ఉన్న‌ కాంగ్రెస్‌ను పక్కన పెట్టే వైఖరి వివిధ పార్టీలు తీసుకుంటున్నాయి. ఒక అంచనా ప్రకారం కాంగ్రెస్‌కు డిఎంకె, ఆర్‌జెడి, ఎన్‌సిపి, జెఎంఎం, జనతాదళ్‌(యు), శివసేన(ఉద్ధవ్‌) పార్టీలు విస్పష్టంగా మద్దతు ఇస్తున్నాయి. సిపిఐ, సిపిఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కశ్మీర్‌ పీపుల్స్ డెమెక్రటిక్‌ పార్టీలు నమ్మదగ్గ మిత్రులుగా ఉన్నాయి. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, బిఆర్‌ఎస్‌, సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌ మిత్రపక్షాల జాబితాలో లేవు. ప్రతిపక్షాల ఐక్యతను కోరుతున్నప్పటికీ కాంగ్రెస్‌ పట్ల అంత సానుకూలంగా లేని ఈ పార్టీలు ప్రతిపక్షాల ఐక్యతకు అసలైన అడ్డంకులుగా పరిణమించే ప్రమాదముంది. ఐక్యతా సమావేశాలకు ముందే ఎవరికివాళ్ళు తమ వైఖరిని చెప్పడం, షరతులు విధించడం, నిందాపూర్వక ఆరోపణలు చేయడం గమనార్హం. బిజెపి, కాంగ్రెస్‌లకు సమాన దూరం పాటించాలనే భావన ఆయా పార్టీలలో ఉంది. కనుక ప్రతిపక్షాల ఐక్యత సుదూర స్వప్నంగా మిగిలే ప్రమాదం లేకపోలేదు.

2024లో బిజెపి అధికారంలోకి వస్తే ఆ తర్వాత దేశంలో ఇక ఎన్నికలే జరగవని, మోదీ ప్రభువులా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని మార్చివేసే ప్రమాదముందని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. కానీ బిజెపియేతర పక్షాల ఐక్యతకు మాత్రం సానుకూలమైన సంకేతాలు పంపడం లేదు. ఆప్‌ మాదిరిగానే ఇతర ప్రతిపక్షాల మాటలకీ, చేతలకీ పొంతన ఉండడం లేదు. కనుకనే బిజెపియేతర పక్షాల ఐక్యత సులువు కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News