బెంగళూరు భేటీకి విపక్షాలు రెడీ
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో గత నెల పాట్నాలో జరిగిన సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. ఈ సారి సమావేశానికి 24 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది.
బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ప్రతిపక్షాల కూటమి ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల నాటికి అధికార పక్షాన్ని ఎదుర్కొనే శక్తిగా అవతరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కూటమికి బయట ఉన్న పార్టీలను కలుపుకుపోయేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. బెంగళూరులో ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న ప్రతిపక్షాల ఉమ్మడి భేటీకి హాజరయ్యే పార్టీల సంఖ్య పెరగనుంది.
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో గత నెల పాట్నాలో జరిగిన సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. ఈ సారి సమావేశానికి 24 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివిధ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఆమె 17వ తేదీ రాత్రి ప్రతిపక్ష నేతలకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మొదటి సమావేశంలో కాంగ్రెస్, JDU, RJD, తృణమూల్ కాంగ్రెస్, AAP, DMK, సమాజ్‌వాది పార్టీ, NCP, శివసేన (ఉద్ధవ్) పార్టీల అధినేతలు పాల్గొన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో అదనంగా నేషనల్ కాన్ఫరెన్స్, మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం (MDMK), కొంగు దేశ మక్కల్ కట్చి (KDMK), విడుదలై చిరుతైగళ్ కట్చి (VCK), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RCP), ఆల్ ఇండియా ఫార్వాడ్ బ్లాక్ (AIFB), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీలు భాగం కానున్నాయి.
బెంగళూరు సమావేశానికి రావాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖలు పంపిన 24 పార్టీలు ప్రస్తుతం 150 లోక్‌సభ సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అనుసరించాల్సిన నిర్మాణాత్మక వ్యూహాలపై విపక్షాలు చర్చించనున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్స్, ఉమ్మడి పౌర స్మృతి లాంటి కీలక అంశాలపై కూడా విపక్షాలు చర్చించే అవకాశం ఉంది.